భారత్ నిర్దేశించుకున్న ఆర్ధిక లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్ధిక సర్వే ఉందని ప్రధాని నరేంద్రమోడీ  అన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా మార్చాలని పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్ధిక సర్వే- 2019 రూపునిస్తోందన్నారు. సామాజిక రంగం, సాంకేతికతను అందిపుచ్చుకునే లక్ష్యం ఎనర్జీ సెక్యూరిటీ పురోగతి వంటి అంశాలను కూడా వర్ణిస్తోందని.. దీనిని చదవండి అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

2024-2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారడానికి.. వృద్ధి రేటు ఇప్పటి నుంచే 8 శాతం దాటాలని ఆర్థిక సర్వేలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు.. ఇప్పటికే ప్రధాని మోడీ తెలిపారు.

పెట్టుబడుల రేటు పెరిగే అవకాశాలు, వృద్ధిరేటులో మందగమనం, జీఎస్టీ, ప్రభుత్వ పథకాలు వల్ల ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలను ఇందులో వివరించారు. భారత్‌లో సుస్థిర సర్కార్ ఏర్పడటం దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని పెంచుతుందని సర్వేలో పేర్కొన్నారు.