ప్రధాని నరేంద్రమోడీ సోదరుడు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగారు. ప్రధానమంత్రి సోదరుడేంటి ధర్నా చేయడమేంటి అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. భద్రతా కారణాల రీత్యా ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారులను ప్రభుత్వం కేటాయించింది.

నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లననని, వారికి ప్రత్యేక పోలీస్ వాహనం ఏర్పాటు చేయాలంటూ ప్రహ్లాద్ డిమాండ్ చేశారు.

అక్కడితో ఆగకుండా జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై బగ్రు పోలీస్ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట పాటు ప్రహ్లాద్ ఆందోళన సాగించారు. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ఆయన తన భద్రతా సిబ్బందిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.