Asianet News TeluguAsianet News Telugu

చారిత్రాత్మక ఘట్టం .. యూఎస్‌ కాంగ్రెస్‌లో 2వ సారి ప్రసంగించనున్న మోదీ, తొలి భారత ప్రధానిగా ఘనత

ఈ నెలలో అమెరికా పర్యటనకు వెళ్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తద్వారా ఈ ఘనతను రెండోసారి అందుకున్న తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. 

PM narendra modis Second Address to a Joint Meeting of the US Congress is historic ksp
Author
First Published Jun 6, 2023, 9:52 PM IST

యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో అమెరికా చట్ట సభ ప్రముఖులు పంపిన ఆహ్వానానికి ఆయన ఆమోదం తెలిపారు. అయితే అమెరికా పార్లమెంట్‌లో ఓ భారత ప్రధాని రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి. ప్రపంచంలోని ఇతర దేశాధినేతల్లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యధికంగా మూడుసార్లు US కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తర్వాత ప్రధాని మోదీ రెండో స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీకి దక్కిన ఈ గౌరవం అమెరికాలో ఆయనకున్న ద్వైపాక్షిక గౌరవాన్ని, మద్దతును తెలియజేస్తోంది. విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా వంటి దిగ్గజ నేతల తర్వాత ప్రధాని మోదీకి ఈ గౌరవం దక్కింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 22న యునైటెడ్ స్టేట్స్‌లో అధికారిక పర్యటనకు బయలుదేరుతారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌లు  వైట్ హౌస్‌లో విందు ఆతిథ్యం ఇవ్వనున్నారు. యూఎస్ కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జూన్ 22 న తన దేశ పర్యటన సందర్భంగా ప్రతినిధుల సభ, సెనేట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాల్సిందిగా యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రధాని మోదీని ఆహ్వానించింది.

‘‘మీ ప్రసంగ సమయంలో భారతదేశ భవిష్యత్తు గురించి మీ దృష్టిని పంచుకోవడానికి, మన దేశాలు ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లతో మాట్లాడటానికి మీకు అవకాశం ఉంటుంది’’ అని హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ, సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమెర్, సెనేట్ రిపబ్లికన్ లీడర్ మిచ్ మెక్‌కానెల్, హౌస్ డెమోక్రటిక్ లీడర్ హకీమ్ జెఫ్రీస్‌లు మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా, అమెరికా- భారత్‌ల మధ్య లోతైన, సన్నిహిత భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఒక అవకాశంగా నిలుస్తుందని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios