యాస్ తుఫాన్ విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రేపు పర్యటించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో యాస్ తుఫాన్ ప్రభావంపై ఆయన సమీక్షించనున్నారు. మోడీ తొలుత భువనేశ్వర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారనీ.. అనంతరం బాలాసోర్‌, భద్రక్, పూర్వ మిడ్నాపూర్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి.

ఒడిశా పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. యాస్ తుఫాన్ బుధవారం తుర్పూ కోస్తా తీరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. తుఫాన్ కారణంగా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లోని 21 లక్షల మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 

Also Read:భయంకరమైన తుఫాన్.. బయటకెందుకు వచ్చావ్ అంటే.. ఏమన్నాడో తెలుసా?

మరోవైపు యాస్ తుఫాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు అపార నష్టం కలిగిందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ. తుపాను దాదాపు కోటి మందిపై ప్రభావం చూపినట్టు సీఎం వివరించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 15 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కానీ భారీస్థాయిలో ఆస్తి నష్టం తప్పలేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయని మమతా బెనర్జీ అన్నారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న పశ్చిమ మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తర పరగణాల జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోటి రూపాయల విలువైన సహాయక సామగ్రిని తరలించినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు.