ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16న ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ‘‘ఆది మహోత్సవ్‌’’ను ప్రారంభించనున్నారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16న ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ‘‘ఆది మహోత్సవ్‌’’ను ప్రారంభించనున్నారు. దేశంలోని గిరిజన జనాభా సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో ప్రధాన మంత్రి మోదీ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో దేశ వృద్ధి, అభివృద్ధిలో వారి సహకారానికి తగిన గౌరవం ఇచ్చారు. జాతీయ వేదికపై గిరిజన సంస్కృతిని ప్రదర్శించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ‘‘ఆది మహోత్సవ్‌’’ను ప్రారంభించనున్నారు.

గిరిజన సంస్కృతి, చేతి పనులు, వంటకాలు, వాణిజ్యం, సాంప్రదాయ కళల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆది మహోత్సవ్‌ ఎగ్జిబిషన్ జరుగుతుంది. కేంద్రం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీఆర్ఐఎఫ్‌ఈడీ) ఆధ్వర్యంలో ఆది మహోత్సవ్‌ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమం వేదిక వద్ద 200 స్టాల్స్‌ ఉండనున్నాయి. వాటిని దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల గొప్ప, విభిన్న వారసత్వాన్ని ప్రదర్శించేలా రూపొందించనున్నారు. ఆది మహోత్సవంలో దాదాపు 1000 మంది గిరిజన కళాకారులు పాల్గొంటారు. హస్తకళలు, చేనేత, కుండలు, ఆభరణాలు మొదలైన సాధారణ ఆకర్షణలతో పాటుగా.. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకుంటున్నందున గిరిజనులు పండించే శ్రీ అన్నాన్ని ప్రదర్శించడంపై మహోత్సవ్‌ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.