మోడీ తమిళనాడు పర్యటన : ఆదివారం అరిచల్ మునై పాయింట్‌ను సందర్శించనున్న ప్రధాని
రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ శనివారం తమిళనాడు చేరుకున్నారు. తొలి రోజు పలు ఆలయాలను సందర్శించిన ప్రధాని.. ఆదివారం అరిచల్ మునై పాయింట్‌ను సందర్శిస్తారు. ఇక్కడి నుంచే త్రేతాయుగం నాటి రామసేతు ప్రారంభమవుతుంది.
అయోధ్యలోని రామ మందిరంలో రాంలల్లా విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట మహోత్సవానికి ఇంకా కొన్ని గంటలే సమయం వుంది. అయితే ప్రాణ్ ప్రతిష్టకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ శనివారం తమిళనాడు చేరుకున్నారు. తొలి రోజు పలు ఆలయాలను సందర్శించిన ప్రధాని.. ఆదివారం అరిచల్ మునై పాయింట్‌ను సందర్శిస్తారు. ఇక్కడి నుంచే త్రేతాయుగం నాటి రామసేతు ప్రారంభమవుతుంది. మునై పాయింట్‌ను సందర్శించిన అనంతరం శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ప్రార్థనలు చేస్తారు.
తొలుత ఆదివారం ఉదయం 9.30 గంటలకు అరిచల్ మునై పాయింట్‌ను మోడీ సందర్శిస్తారు. అనంతరం ఉదయం 10.15 గంటలకు శ్రీకోదండరామ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి దర్శనం చేసుకుంటారు. కోదండరామ అంటే విల్లుతో వున్న రాముడు అని అర్ధం. ఇది ధనుష్కోడిలో వుంది. విభీషణుడు శ్రీరాముడిని మొదటిసారి ఇక్కడే కలుసుకుని, శరణు పొందాడని చెబుతారు. శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇదేనని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.