కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యసభ కొలువుదీరింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టామని.. మహిళా సాధికారత కోసం కట్టుబడి వున్నామని.. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశామని ప్రధాని తెలిపారు.
కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యసభ కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో విప్లవాత్మక బిల్లులు తీసుకొచ్చామని.. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ మారబోతోందని మోడీ ఆకాంక్షించారు.
ఇందుకు కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలవబోతోందని.. మేకిన్ ఇండియా గేమ్ ఛేంజర్‌గా మారిందని ప్రధాని తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టామని.. కొత్త పార్లమెంట్‌లోనే స్వాతంత్ర్య శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించుకుంటామని మోడీ అన్నారు. మహిళా సాధికారత కోసం కట్టుబడి వున్నామని.. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశామని ప్రధాని తెలిపారు. దేశ నిర్మాణంలో మహిళదే కీలకపాత్రగా వుండబోతోందని మోడీ చెప్పారు.
ALso Read: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు .. రేపు చర్చ, ఎల్లుండి రాజ్యసభలో
అంతకుముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గణేష్ చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి అడుగు పెట్టామన్నారు. అజాదీ అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.కొత్త పార్లమెంట్ లో సభకు ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు.ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్టుగా మోడీ పేర్కొన్నారు. . అమృత కాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టుగా ప్రధాని మోడీ చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సెంగోల్‌ది కీలక పాత్ర అని మోడీ గుర్తు చేశారు. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువు దీరిందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు వేయబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. నారీశక్తి బిల్లును చట్టం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని స్పష్టం చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీశక్తి వందన్ అనే పేరు పెట్టినట్టుగా మోడీ పేర్కొన్నారు.కొత్త భవనంలో నారీశక్తిని బలోపేతం చేసేలా తొలి నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు.మహిళా రిజర్వేషన్ బిల్లును నిన్ననే కేంద్రం ఆమోదించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అభివృద్ది ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనుకుంటున్నామన్నారు.నారీశక్తి వందన్ తో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని మోడీ చెప్పారు. ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
