అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రకాల యోగాసనాలను పంచుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యోగా మనసును, శరీరాన్ని ప్రశాంతంగా వుంచుతుందని ఆయన పేర్కొన్నారు.  

యోగా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. శరీరం, మనస్సును ఆరోగ్యంగా వుంచడటంతో పాటు సంతోషంగా ఉండటానికి యోగా ప్రపంచాన్ని కలుపుతుందని ప్రధాని శుక్రవారం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే వారం తన అమెరికా పర్యటన సందర్భంగా.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోడీ నాయకత్వం వహిస్తారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) అధ్యక్షురాలు సబా కొరోసి కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ మేరకు కొరోసి ట్వీట్ చేశారు. వచ్చే వారం జరిగే 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని నార్త్ లాన్‌లో పాల్గొనడానికి తాను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. 

కొరోసి ట్వీట్‌పై స్పందించిన ప్రధాని మోదీ రిప్లయ్ ఇచ్చారు. “ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. మీ భాగస్వామ్యం ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. యోగా అనేది శరీరం , మనస్సు ఆరోగ్యంగా , సంతోషంగా ఉండే దిశలో ప్రపంచాన్ని ఒకచోట చేర్చుతుంది. యోగా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందింది. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ మరో ట్వీట్‌లో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మోడీ కొన్ని ఆసనాలను తెలియజేసే వీడియోను కూడా పంచుకున్నారు.

Scroll to load tweet…

ఇకపోతే.. మోడీ అమెరికా పర్యటన న్యూయార్క్‌లో ప్రారంభమవుతుంది. జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోడీ నాయకత్వం వహిస్తారు. డిసెంబర్ 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. అలాగే యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. తద్వారా ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డుల్లోకెక్కనున్నారు. దీనితో పాటు వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొంటారు.

మరోవైపు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌లు కీల‌క ఒప్పందాలు చేసుకునే అవకాశ‌ముంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల ఇంజిన్ల త‌యారీ సంస్థ జీఈ భార‌త్ లో ఇంజిన్ల త‌యారీకి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే అవ‌కాశ‌ముంది. తేజస్ ఎంకె11 సహా భవిష్యత్తులో అన్ని యుద్ధ విమానాలు GE F414 ఇంజిన్లతో పనిచేస్తాయి. అడ్వాన్స్ డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ), ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టెడ్ బీఎఫ్ )లకు కూడా ఇదే ఇంజిన్ ఉంటుంది.