Asianet News TeluguAsianet News Telugu

‘‘ రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ’’ నినాదంతో ముందుకెళ్లాం : 17వ లోక్‌సభ చివరి సమావేశంలో మోడీ

రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు గురువారం లోక్‌సభలో ఆయన ప్రసంగించారు . ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోక్‌సభ ఆమోదించిందని ప్రధాని చెప్పారు. 

PM narendra Modi says productivity of 17th Lok Sabha around 97% Reform, perform, transform ksp
Author
First Published Feb 10, 2024, 5:43 PM IST | Last Updated Feb 10, 2024, 5:53 PM IST

గత ఐదేళ్లలో అనేక మార్పులు , సంస్కరణలు తీసుకొచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు గురువారం లోక్‌సభలో ఆయన ప్రసంగిస్తూ.. దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్ధితిని సమర్ధంగా ఎదుర్కొన్నామని.. ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మోడీ వెల్లడించారు. రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని .. కరోనా సమయంలో ఎంపీలు తమ జీతాన్ని బాధితులకు ఇచ్చి ప్రజల్లో విశ్వాసం నింపారని మోడీ వెల్లడించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నామని.. జీ20 సమావేశాల్ని నిర్వహించడం వల్ల ప్రపంచంలో భారత్ గౌరవం పెరిగిందని ప్రధాని తెలిపారు. 

అనేక ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదని.. కొత్త పార్లమెంట్ భవనం మనకు గర్వకారణంగా నిలిచిందని మోడీ చెప్పారు.  ఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని.. భారత్ సామర్ధ్యం ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన జీ 20 సదస్సు విజయవంతమైందని.. డిజిటలైజ్ చేసి కాగిత రహిత పార్లమెంట్‌గా తీర్చిదిద్దామని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకున్నామని ప్రధాని తెలిపారు.

పేపర్‌లెస్ పార్లమెంట్, డిజిటలైజేషన్, సభ్యులకు ఎంతో ఉపయోగపడబోతోందని మోడీ ఆకాంక్షించారు. మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేసిందని.. ఈ సమావేశాల్లో అనేక సంస్కరణలు గేమ్ ఛేంజర్‌లా మారాయని ప్రధాని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకున్న చర్యల వల్ల కశ్మీర్‌లో శాంతి కనిపిస్తోందన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసుకున్నామని.. పేపర్ లీక్ వంటి సమస్యలు రాకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చామని మోడీ చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక చర్యలు తీసుకున్నామని.. వికసిత్ భారత్ ఫలితాలు భావితరాలకు అందుతాయన్నారు. 

ట్రిపుల్ తలాక్‌ను నిషేధించి ముస్లిం మహిళల హక్కులను కాపాడామని ప్రధాని తెలిపారు. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం తెచ్చామని.. వచ్చే పాతికేళ్లు భారత్‌కు ఎంతో కీలకమని నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించనుందని .. ప్రశ్నాపత్రాల లీకేజ్ యువత పాలిట శాపంగా మారిందని ప్రధాని తెలిపారు. యువతకు అన్యాయం జరగకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నామని.. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షపడేలా చట్టం తెచ్చామని మోడీ వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోక్‌సభ ఆమోదించిందని ప్రధాని చెప్పారు. 

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావి భారతానికి ఎంతో ఉపయోగమని.. జమ్మూకాశ్మీర్ ప్రజల పక్షాన నిలబడ్డామని, 370 ఆర్టికల్‌ను తొలగించామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మేం చేపట్టిన చర్యలతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు సంతోషిస్తాయని.. ముద్ర యోజన ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చామని ప్రధాని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు పద్మ పురస్కారాలు ఇచ్చి గొప్ప మార్పు దిశగా అడుగువేశామన్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని.. కొందరికి అప్పుడే టెన్షన్ మొదలైందని ఆయన విపక్షాలపై సెటైర్లు వేశారు. తనకు గట్టి సవాల్ ఎదురైనప్పుడు, మరింత ఆనందం కలుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios