కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసిన ఆయన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించినందుకు ఆయన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

అంతకుముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని అన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని బొమ్మై స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యవస్థీకృత ఎన్నికల వ్యూహం ఫలించిందనీ, దాని విజయానికి ప్రధాన కారణాలలో అది కూడా ఒకటి అని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయనీ, ప్రజల ఆదేశాన్ని తాను చాలా గౌరవంగా స్వీకరిస్తున్నానని సీఎం తెలిపారు. బీజేపీ ఓటమికి తాను బాధ్యత వహిస్తాననీ, మరెవరికీ బాధ్యత లేదనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటమికి వివిధ కారణాలు ఉన్నందున పూర్తి విశ్లేషణ చేస్తామని బొమ్మై అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పనితీరును కూలంకషంగా విశ్లేషిస్తామన్నారు ముఖ్యమంత్రి.

Also Read: కర్ణాటక ఫలితాలు.. జేడీఎస్, బీజేపీలకు పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ సత్తా.. కారణాలు ఇవేనా..?

అన్ని లోటుపాట్లను అధిగమించి, వ్యవస్థీకృతమై, పార్టీ మరోసారి పుంజుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. తమది జాతీయ పార్టీ అని, తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి సంస్థాగతంగా, పరిపాలనాపరంగా అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తామని బొమ్మై చెప్పారు. ఈ ఎన్నికలలో మోడీ, షా మంత్రం పని చేయలేదని మీడియా ప్రతినిధులు అడగగా.. ఈ పరిణామానికి అనేక కారణాలు ఉన్నాయని దాటవేశారు. క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత దాని గురించి మాట్లాడుతానని ముఖ్యమంత్రి అన్నారు. ఫలితాలు ఇంకా ఖరారు అవుతున్నాయనీ, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని అని ఆయన పేర్కొన్నారు. తనను ఎన్నుకున్నందుకు షిగ్గావ్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బొమ్మై స్పష్టం చేశారు.

Scroll to load tweet…