Asianet News TeluguAsianet News Telugu

General Bipin Rawat Passes Away: నిజమైన దేశభక్తుడు.. రావత్ మరణంపై మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలవ్వడంపై ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతిచెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు

PM Narendra Modi Rajnath Singh condole death of CDS Bipin Rawat
Author
New Delhi, First Published Dec 8, 2021, 6:59 PM IST

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలవ్వడంపై ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతిచెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వీరంతా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడుతూ బిపిన్‌ రావత్‌తో ఉన్నఫొటోను మోడీ ట్విటర్‌లో పంచుకున్నారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ గొప్ప సైనికుడని, సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో గొప్పగా కృషిచేశారని మోడీ ప్రశంసించారు. వ్యూహాత్మక అంశాలపై ఆయన సామర్థ్యం, దృక్పథం అసాధారణమైందని కొనియాడు. అలాంటిగొప్ప వ్యక్తి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు.

బిపిన్‌ రావత్‌ మృతిచెందడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (amit shah) సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మన సీడీఎస్‌ని ఘోర ప్రమాదంలో కోల్పోవడం బాధాకరమన్నారు. ధైర్య సాహసాలతో కూడిన గొప్ప సైనికుల్లో ఆయన ఒకరని, మాతృభూమికి నిస్వార్థంగా సేవ చేశారని అమిత్ షా కొనియాడారు. బిపిన్‌రావత్‌ చేసిన సేవల్ని, ఆయన నిబద్ధతను మాటల్లో చెప్పలేమని గుర్తుచేశారు. అలాగే, బిపిన్‌ రావత్‌ సతీమణి మధులికరావత్‌తో పాటు మరో 11 మంది సైనికులు మరణించడం కలిచివేసిందని అమిత్ షా పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే  రావత్‌ మరణం పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. 

కాగా.. తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో ఆ హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన మొత్తం 14 మంది ప్రయాణీకుల్లో ఏ ఒక్కరు బతికి బట్టకట్టలేదు. 

తమిళనాడు (tamilnadu) రాష్ట్రం కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో బుధవారం ఈ చాపర్ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది. 

ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదే ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (Bipin Rawat ) సతీమణి మధులికా (madhulika rawat) కూడా మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో వున్న జనరల్ బిపిన్ రావత్‌ పరిస్ధితి అత్యంత విషమంగా వుంది. అయితే ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios