రష్యా సరిహద్దుల్లో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్ధులు తమను రక్షించాల్సిందిగా కేంద్రానికి మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు.  

రష్యా అధ్యక్షుడు (russia president) వ్లాదిమిర్ పుతిన్‌కు (putin) ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లోని (ukraine) భారతీయ విద్యార్థుల (indian students) తరలింపుపై ఆయనతో మాట్లాడారు. ఇప్పటికే భారతీయ విద్యార్ధుల తరలింపుపై సహకరిస్తామని హామీ ఇచ్చింది రష్యా. అలాగే రష్యా నుంచి భారతీయ విద్యార్థులను తరలించేందుకు సహకరించాల్సిందిగా మోదీ పుతిన్ ను కోరారు. విద్యార్థుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. దీనికి పుతిన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లుగా సమాచారం. 

రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సరిహద్దు దేశాల నుంచి విద్యార్థులను తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం చేపట్టింది. అయితే భారతీయ విద్యార్థులు రష్యా సరిహద్దు సమీపంలోని సుమీ పట్టణంలో ఉన్నారు. అక్కడి నుంచి రష్యా సరిహద్దుకు చేరుకోవడానికి రెండు గంటలు సమయం పడుతుందని, దీంతో తమను రష్యా నుంచి భారత్ కు తరలించాలని విద్యార్థులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ పుతిన్ కు ఫోన్ చేశారు.

ఇకపోతే.. ఖార్కివ్‌ను (kharkiv) వెంటనే ఖాళీ చేయాలని అక్కడి భారతీయులను ఆదేశించింది ఉక్రెయిన్‌లోని భారతీయ విదేశాంగ శాఖ (ministry of external affairs ) . వెంటనే ఖార్కివ్‌ను వదిలి వెంటనే సరిహద్దులను చేరుకోవాలని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం.. సాయంత్రం 6 గంటలలోపు ఖార్కివ్ నుంచి వచ్చేయాలని ఆదేశించింది. పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు వెంటనే వెళ్లాలని సూచించింది. 4 గంటల్లో ఖార్కీవ్‌ను ఖాళీ చేయాలని భారత ప్రభుత్వం విద్యార్ధులను ఆదేశించింది. వాహనాలు దొరకకపోతే కాలినడకన వెళ్లాలని కోరింది. బెజ్లాడోకాకు నడుచుకుంటూ వెళ్లాలని సూచించింది. 

అయితే ఉక్రెయిన్‌ (ukraine) యుద్ధాన్ని రోజుల్లోనే ముగించాలనుకున్న రష్యాకు (russia) అది అంత తేలిక కాదనే విషయం త్వరగానే అర్ధమైంది. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను ఆక్రమించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో రష్యాకు కాస్త ఉపశమనం లభించింది. దక్షిణ ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరంపై ఆ దేశపు సైన్యం పూర్తిగా పట్టు సాధించింది. నగరంలో ఎక్కడ చూసినా రష్యా సాయుధ వాహనాలే కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ నగరాల దిశగా రష్యా అదనపు బలగాలను తరలిస్తోంది. 

అటు, రాజధాని కీవ్ పైనా రష్యా బలగాలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి భారీ టీవీ టవర్ ను రష్యా సైన్యం పేల్చివేసింది. దాంతో కీవ్ లో టెలివిజన్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఇక.. నిన్న క్షిపణి దాడులతో దద్దరిల్లిన ఖార్కివ్ లోనూ పరిస్థితి ఏమీ మారలేదు. బుధవారం కూడా ఖార్కివ్ నగరంలో పోలీసు కార్యాలయంపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఖార్కివ్ నగరంలోనే నిన్న జరిగిన క్షిపణి దాడిలో కర్ణాటకకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ సహా 21 మంది మరణించగా.. 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.