పీఎం విశ్వకర్మ యోజన స్కీం ప్రారంభం.. కులవృత్తులకు ఆశాకిరణమన్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన కళాకారులు, నిపుణులకు ‘‘పీఎం విశ్వకర్మ’’ సర్టిఫికెట్లను అందజేశారు. చేతి వృత్తుల వారు, హ్యాండ్ స్కిల్స్, టూల్స్‌తో పనిచేస్తున్న లక్షలాది మంది కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని ద్వారకలో నూతనంగా నిర్మించిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన కళాకారులు, నిపుణులకు ‘‘పీఎం విశ్వకర్మ’’ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ.. విశ్వకర్మ పథకం కులవృత్తుల వారికి ఆశాకిరణమన్నారు.
విశ్వకర్మ జయంతిని భారత సాంప్రదాయ కళాకారులు, నిపుణులకు అంకితం చేశామన్నారు. దేశ ప్రజలకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. విశ్వకర్మ ఆశీస్సులో విశ్వకర్మ యోజనను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. చేతి వృత్తుల వారు, హ్యాండ్ స్కిల్స్, టూల్స్‌తో పనిచేస్తున్న లక్షలాది మంది కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఆకాంక్షించారు.
కాగా.. పీఎం విశ్వకర్మ యోజన కింద 18 రకాల సాంప్రదాయ చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకోసం రూ.13 వేల కోట్ల నిధులను కేంద్రం అందిస్తోంది. ఎలాంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణ సదుపాయాన్ని అందిస్తారు. దీనిలో భాగంగా తొలుత రూ. లక్ష ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత అదనంగా రూ.2 లక్షల లోన్ అందజేస్తారు.