స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, అమృత్ 2.0లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలో బీఆర్ అంబేడ్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ మిషన్‌లను ప్రకటిస్తూ బీఆర్ అంబేడ్కర్‌నూ ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 పట్టణాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తుందని వివరించారు. సమానత్వానికి పట్టణాల అభివృద్ధి కీలకమని అంబేడ్కర్ భావించారని మోడీ అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి(PM) నరేంద్ర మోడీ(Narendra Modi) శుక్రవారం స్వచ్ఛ భారత్ మిషన్(Swachh Bharat Mission) 2.0ను ప్రారంభించారు. దీనితోపాటు అమృత్ 2.0నూ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్(Urban), అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్, అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్(అమృత్)లు బీఆర్ అంబేడ్కర్(BR Ambedkar) కలలను సాకారం చేయడంలో ముందడుగు వేస్తాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి అన్నారు.
ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనే ఈ రెండు మిషన్‌లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ముఖ్యంగా పట్టణాల్లోని చెత్తపై దృష్టి పెడుతుందని వివరించారు. నగరాల్లోని గుట్టలుగా పేరుకుపోయిన చెత్త మేటలను ఈ మిషన్‌లోభాగంగా పూర్తిగా తొలగించాలని అన్నారు. ఈ చెత్తను ప్రాసెస్ చేసి తొలగించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద నగరాలు చెత్తరహితమైనవిగా మారాలని తెలిపారు. అంతేకాదు, ఈ సెకండ్ ఫేజ్‌లో సీవేజ్, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లూ మెరుగుపరచాలని వివరించారు. నగరాల్లో మంచినీటి కొరత లేకుండా, నాలాలు నదుల్లో మారకుండా చర్యలు తీసుకోవడం ఇందులో ప్రధానంగా ఉంటాయని చెప్పారు.
స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, అమృత్ 2.0లు అంబేడ్కర్ కలలను సాకారం చేయడానికి ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అలాంటి ఈ కార్యక్రమాన్ని బీఆర్ అంబేడ్కర్ సెంటర్‌లో నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. సమానత్వానికి పట్టణాల అభివృద్ధి కీలకమని అంబేడ్కర్ భావించారని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు.
వేగంగా పట్టణీకరణ జరుగుతున్న మనదేశానికి ఈ మిషన్‌లో అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని, 2030 లక్ష్యాలను సాధించడంలో ఉపయోగపడుతాయని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
