జమ్మూకశ్మీర్‌లో భారీస్థాయి దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్మూ శివారులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారనీ సైన్యం తెలిపింది. 

జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రక్కు డ్రైవర్‌ వెంటనే దిగి పారిపోగా, ట్రక్కులో బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు.

దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ట్రక్కు నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు భారీగా మందులు, పేలుడు సామగ్రి, వైర్ల బండిళ్లు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు లభ్యమయ్యాయి. 

26/11 ఉగ్రవాద దాడి వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు మరోసారి పెద్ద దాడి చేయాలని ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ నేపథ్యంలో “నగ్రోటా” ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, ఉన్నత నిఘా సంస్థల అధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది. 

 

 

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చడంపై ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందించారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు కలిగివున్న తీవ్రవాదులను అంతమొందించడం ద్వారా విధ్వంసానికి వారు పన్నిన కుట్రను సైన్యం అడ్డుకుందన్నారు. 

 

భద్రతా దళాలు మరోసారి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రధాని కొనియాడారు. విధి నిర్వహణలో వారి అప్రమత్తకు ధన్యవాదాలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్‌లో బలంగా వున్న ప్రజాస్వామ్య పునాదులను కదిలించేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రను సైన్యం భగ్నం చేసిందని మోడీ ప్రశంసించారు.