ఈ విజయానికి కారణం మీరే : జీ 20 సమ్మిట్ కోసం శ్రమించిన సిబ్బందితో ప్రధాని మోడీ
ఈ నెల 9, 10 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన మెగా జీ20 సమ్మిట్ కోసం శ్రమించిన అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇంటరాక్ట్ అయ్యారు . క్లీనర్‌లు, డ్రైవర్లు, వెయిటర్లు, ఇతర సహాయక సిబ్బంది పాల్గొన్నారు.

ఈ నెల 9, 10 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన మెగా జీ20 సమ్మిట్ కోసం శ్రమించిన అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇంటరాక్ట్ అయ్యారు. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం మీరేనంటూ వారిని ప్రశంసించారు. జీ20 సమ్మిట్‌ను విజయవంతం చేసిన ఘనత మీ అందరికీ చెందుతుందని.. మీ అనుభవాలను డాక్యుమెంట్ చేస్తారని ఆశిస్తున్నానని మోడీ పేర్కొన్నారు.
భవిష్యత్ కార్యక్రమాలకు ఇది మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని 3000 మంది అధికారులను ఉద్దేశించి ప్రధాని అన్నారు. మీ అనుభవాలను డాక్యుమెంట్ చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని జీ20 బృందానికి మోడీ సూచించారు. మీరు సవాళ్లను ఎలా అధిగమించారన్నది ప్రతి ఒక్కరూ వారి వారి మాతృభాషలలో రాయాలని ప్రధాని కోరారు. ఇది 100 పేజీలలో నడుస్తుందని.. కప్‌బోర్డ్‌కు బదులుగా క్లౌడ్‌లో దీనిని స్టోర్ చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు.
జీ20 సమ్మిట్‌ను సజావుగా నిర్వహించడం వెనుక వున్న పేరు లేని హీరోలను గౌరవించే లక్ష్యంతో ప్రధాని మోడీ, అధికారుల మధ్య జరిగిన పరస్పర చర్యలలో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన క్లీనర్‌లు, డ్రైవర్లు, వెయిటర్లు, ఇతర సహాయక సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో విదేశాంగ శాఖ, ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్, ఐఏఎఫ్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది కూడా వున్నారు. ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత వారికి ప్రధాని మోడీ విందును ఇవ్వనున్నారు.
భారత్ అధ్యక్షతన జరిగిన ఈ ఏడాది జీ20 సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 40 మంది దేశాధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. దీనిని ఓ ముఖ్యమైన మైలురాయిగా నిపుణులు పేర్కొన్నారు. సమ్మిట్ సందర్భంగా జీ20 సభ్యులు న్యూ ఢిల్లీ లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్‌ను 100 శాతం ఏకాభిప్రాయాన్ని అందించారు. 55 మంది సభ్యుల ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా ప్రధాని మోడీ ప్రకటించారు. 1999లో జీ20 ప్రారంభమైన తర్వాత ఈ కూటమిలో ఇది తొలి విస్తరణ. సమ్మిట్ చివరి రోజున భారత్.. బ్రెజిల్‌కు తదుపరి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.