కాంగ్రెస్‌పై మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ . సమాజం ప్రశాంతంగా వుంటే.. కాంగ్రెస్ ప్రశాంతంగా వుండలేదని మోడీ చురకలంటించారు. కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకోవాలని చూస్తోందని.. తమకు మాత్రం కర్ణాటక అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా వుండాలని ప్రధాని అన్నారు. 

కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసపెట్టి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా మూబబిద్రిలో జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో కర్ణాటక అస్థిరంగా వుండేదన్నారు. దేశ వ్యతిరేక శక్తులతో ఆ పార్టీ చేతులు కలుపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సమాజం ప్రశాంతంగా వుంటే.. కాంగ్రెస్ ప్రశాంతంగా వుండలేదని మోడీ చురకలంటించారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా ఆ పార్టీ సహించలేకపోతోందని.. ఆ పార్టీ కేవలం విభజించు, పాలించు అనే సూత్రంపైనే రాజకీయాలు చేస్తోందని మోడీ ఆరోపించారు. కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకోవాలని చూస్తోందని.. తమకు మాత్రం కర్ణాటక అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా వుండాలని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ రిటైర్‌మెంట్ పేరుతో ఓట్లు అడుగుతోందని.. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని చూస్తోందని నరేంద్ర మోడీ ఆరోపించారు. 

ALso Read: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి - ప్రధాని నరేంద్ర మోడీ..

‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాల నాయకత్వ వైరం ప్రతిచోటా ఉంది. చత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అబద్ధాల గుంపు అని అక్కడి ప్రజలకు ఇప్పుడు అర్థమైంది’’ అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమలో తాము పోరాడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన జేడీఎస్ ను కాంగ్రెస్ బీ టీమ్ గా ప్రధాని అభివర్ణించారు. ‘‘కాంగ్రెస్‌కు చెందిన జేడీఎస్ బీ టీమ్ కూడా కలలు కంటోంది. 15 లేదా 20 సీట్లు సాధించి, దోపిడిలో పాలుపంచుకోవాలని ఆశిస్తున్నారు’’ అని ప్రధాని మోడీ అన్నారు. 

కర్నాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పరస్పరం వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. కానీ ఎన్నికలకు ముందు ఇలాగే ఉండి, ఎన్నికల తరువాత జత కట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. 2018లో మాదిరిగానే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రంలో బీజేపీని అధికారం నుంచి దింపేందుకు కాంగ్రెస్, కుమారస్వామిలు జట్టు కడుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు సీనియర్ నాయకులు తోసిపుచ్చారు.