కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి , సహాయక చర్యలకు ఆదేశం
ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లాలో ఆగివున్న గూడ్స్ రైలును చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . బాధితులకు అన్ని విధాలా సహాయం అందజేస్తామని మోడీ పేర్కొన్నారు.

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లాలో ఆగివున్న గూడ్స్ రైలును చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఒడిషాలో రైలు ప్రమాదం తనను కలచివేసిందని.. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు బాధితుల కుటుంబాలతో వున్నాయన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించానని.. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని మోడీ పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందజేస్తామని మోడీ పేర్కొన్నారు.
కాగా.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్‌లో ఆగివున్న గూడ్స్‌ను ఢీకొట్టింది. బాలాసోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 5 బోగీలు పట్టాలు తప్పగా, వందల మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం దాటికి బోగీలు పల్టీలు కొట్టగా.. ప్రయాణీకులు చెల్లాచెదురుగా పడిపోయారు. చిమ్మ చీకటి కావడంతో ప్రయాణీకులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే, పోలీస్, ఇతర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల కోసం 60 అంబులెన్స్‌లను అధికారులు సిద్ధం చేశారు. అలాగే బాలేశ్వర్‌లోని మెడికల్ కాలేజ్‌లు, ఆసుపత్రులకు చెందిన సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.
సహాయక చర్యల కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.
షాలిమార్ : 9903370746
ఖరగ్‌పూర్ : 8972073925, 9332392339
బాలేశ్వర్ : 8249591559, త7978418322
హౌరా : 033-26382217