వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం పట్ల ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ వ్యవసాయ రంగంలో ఇది శుభదినమని ప్రధాని అభివర్ణించారు.

ఈ బిల్లులకు పార్లమెంట్ ఆమోదంతో దేశంలో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయంటూ ప్రధాని వరుస ట్వీట్లు చేశారు. వ్యవసాయ బిల్లులతో కోట్లాది మంది రైతుల చేతికి ధరల విషయంలో అధికారం వస్తుందని అన్నారు.  

అదే సమయంలో పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని మోడీ స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ బిల్లులు దోహదపడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:ఆ బిల్లులను ఆమోదించొద్దు.. తిప్పి పంపండి: రాష్ట్రపతిని కోరిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్

రైతులకు మెరుగైన జీవనం అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందడం తెలిసిందే.

విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటింగ్ ద్వారా బిల్లులు సభామోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రకటించారు.

కాంగ్రెస్, తృణాముల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్, జేడీఎస్ సహా 14 పార్టీలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వైసీపీ తదితర పార్టీలు ఈ బిల్లులకు రాజ్యసభలో మద్దతు తెలిపాయి.