కేంద్ర ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేశారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడైనా ప్రహ్లాద్ మోడీ తమ సంస్థ డిమాండ్లతో నినాదలు ఇస్తూ ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రహ్లాద్ మోడీ ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు కూడా. ఈ సంస్థకు చెందిన పలు డిమాండ్లతో ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. 

బ్యానర్లు, ప్లకార్డులతో అఖిల భారత రేషన్ షాపుల డీలర్ల సమాఖ్య సభ్యులు ఈ రోజు నినాదాలు ఇస్తూ నిరసనలు చేశారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ దీర్ఘకాల డిమాండ్లతో ఓ మెమోరాండాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సమర్పిస్తామని ప్రహ్లాద్ మోడీ తెలిపారు. తమ మనుగడ కోసం ఈ మెమోరాండం సమర్పిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం పెరిగిన లివింగ్ కాస్ట్, షాపులు నడపడమూ ఖరీదైన వ్యవహారంతో తమ జీవితాలు సంకటంలో పడ్డాయని పేర్కొన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కిలో ధాన్యాలకు మార్జిన్‌ను కేవలం 20 పైసలు పెంచడం నిజంగా దారుణమైన జోక్ అని విమర్శించారు. కాబట్టి, వెంటనే కేంద్ర ప్రభుత్వం తమకు ఆర్థికమైన ఉపశమనం అందించాలని కోరారు. తమ ఆర్థిక సమస్యలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బుధవారం తమ సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ తర్వాత అవలంబించాల్సిన తమ ఆందోళన రూపాలపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు, రేపు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్టు ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రెటరీ బిశ్వంబర్ బసు తెలిపారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ రేషన్ మాడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ సంస్థ డిమాండ్ చేయడం గమనార్హం.