Asianet News TeluguAsianet News Telugu

రూ. 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్: ప్రధాని ప్రకటన

కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదడానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు

Pm Narendra modi anounce atma nirbhar bharat abhiyan package
Author
New Delhi, First Published May 12, 2020, 8:25 PM IST

కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదడానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. నాలుగు నెలలుగా ప్రపంచం కరోనాతో పోరాడుతోందన్నారు ప్రధాని మోడీ. వైరస్ ప్రపంచమంతా వ్యాపించిందన్న ఆయన ఇలాంటి సంక్షోభం కనీవినీ ఎరుగనిదని ప్రధాని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి పైగా కరోనా సోకగా, 2 లక్షల 88 వేల మంది చనిపోయారని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని.. కానీ మనిషి ఓడిపోవడానికి సిద్ధంగా లేడని ప్రధాని గుర్తుచేశారు.

ఈ వైరస్ నుంచి మనం కాపాడుకుంటూనే ముందుకు వెళ్లాలని.. మనం మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని మోడీ చెప్పారు. మన సంకల్పం, ఈ సంక్షోభం కంటే చాలా గొప్పదన్నారు. 21వ శతాబ్ధం భారతదేశానిదేన్న ఆయన.. ఆత్మస్థైర్యం కలిగిన భారత్ అనేదే మన మార్గమని మోడీ తెలిపారు.

ప్రస్తుతం దేశం కీలకమైన దశలో ఉందని, ఈ సంక్షోభం మనకు ఒక అవకాశంగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. కరోనా సంక్షోభం మొదలైనప్పుడు మనదేశంలో పీపీఈల ఉత్పత్తి లేదని, ఇప్పుడు ప్రతిరోజూ 2 లక్షల పీపీఈలు, ఎన్-95 మాస్కులు ఉత్పత్తి చేస్తున్నామని ప్రధాని అన్నారు.

ఆపదను అవకాశంగా మార్చుకోవడం అంటే ఇదేనన్న మోడీ, భారత్ పురోగతే ప్రపంచం పురోగతిగా మోడీ అభివర్ణించారు. ఈ చావుబతుకుల యుద్ధంలో భారత్ ఉత్పత్తి చేస్తున్న ముందులే ఆశాజ్యోతి.. ఆత్మ నిర్భర్ భారత్ మన లక్ష్యమన్నారు.

భారతదేశ సామర్ధ్యన్ని ప్రపంచం నమ్ముతోందన్న ఆయన సప్లై చైన్‌ను మరింత పటిష్టం చేయాలని కోరారు. కచ్ భూకంపం రోజుల్నీ తాను చూశానని, ఆ విధ్వంసం నుంచి కచ్ పురోగమించిందని.. అదే మన బలానికి ఉదాహరణ అన్నారు. భారత స్వయం సమృద్ధి ఐదు స్తంభాలపై నిలబడిందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios