దేశంలో కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలకు ప్రధాని మోడీ చెక్ పెట్టారు. మరోసారి కరోనా మహమ్మారిపై భీకర యుద్దం చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. మంగళవారం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీల ప్రతినిధులతో భేటీ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని. లాక్‌డౌన్ అనేది చివరి అస్త్రం కావాలని ఆయన అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉద్ధృతంగా వుందని మోడీ పేర్కొన్నారు. మనందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని వైద్య సిబ్బందికి ప్రధాని సెల్యూట్ చేశారు.

ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదని.. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా వుందని మోడీ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఈ దిశగా కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఆక్సిజన్ ప్రత్యేక రైలు.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీరుస్తోందని ప్రధాని తెలిపారు.

జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు మందుల ఉత్పత్తి చాలా రెట్లు పెంచామని... మనదేశంలో అత్యంత శక్తివంతమైన ఫార్మా సెక్టార్ వుందని మోడీ పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగామని ప్రధాని వెల్లడించారు.

Also Read:మే నుండి18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్: కేంద్రం సంచలన నిర్ణయం

ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామని... ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన వ్యాక్సినేషన్ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. 12 కోట్ల మందికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించామని నరేంద్రమోడీ చెప్పారు.

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలని.. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్ధితులు కాస్తంత మెరుగయ్యాయని మోడీ పేర్కొన్నారు. 

వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు గణనీయంగా పెంచుకున్నామన్న ప్రధాని.. అవసరమైన వారికి సాయం అందించేందుకు దేశం అంతా ఒకటి కావాలని పిలుపునిచ్చారు. యువకులు గ్రూపులుగా ఏర్పడి కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చొరవ తీసుకోవాలని మోడీ విజ్ఞప్తి చేశారు.

దీని వల్ల కంటైన్మెంట్ జోన్స్, లాక్‌డౌన్ పెట్టాల్సిన అవసరం రాదని మోడీ స్పష్టం చేశారు. దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడాలని.. ‘‘దవాయి భీ, కడాయి భీ అంటూ ప్రధాని నినాదం ఇచ్చారు. 

లాక్‌డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆచితూచి వ్యవహరించాలని.. లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగా మాత్రమే రాష్ట్రాలు ప్రయోగించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. దేశంలో లాక్‌డౌన్ పెట్టే పరిస్ధితులు తెచ్చుకోవద్దని ప్రధాని తెలిపారు.