పెద్దలు ఇల్లు దాటి బయటకు వెళ్లరాదని, ప్రజల కోసం ప్రజలే స్వచ్ఛంధంగా కర్ఫ్యూ విధించుకోవాలని అదే జనతా కర్ఫ్యూ అని ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మార్చి 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా జనతా కర్ఫ్యూ పాటించాలని నరేంద్రమోడీ కోరారు.

కరోనా తీవ్రత నేపథ్యంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ. గురువారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రస్తుతం కరోనా కన్నా సీరియస్ అంశం ఇప్పుడు ఏదీ లేదని స్పష్టం చేశారు. కరోనాను ఇంక తేలిగ్గా తీసుకోలేమని, ప్రపంచం మొత్తం ఇప్పుడు వైరస్‌తో పోరాడుతోందని మోడీ తెలిపారు.

రానున్న కొద్దివారాలు అత్యంత కీలకమని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్ధితులు ఉన్నాయని ప్రధాని అన్నారు. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్ లేదని, రెండో ప్రపంచ యుద్ధం వల్ల కూడా ఇన్ని దేశాలు ఇబ్బంది పడలేదని మోడీ గుర్తుచేశారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

ప్రజలు తమ జీవితంలోని ఇంకొన్ని వారాలు తనకివ్వాలని, ఇంకొన్ని వారాలు దేశ ప్రజలు త్యాగం చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మానవ జాతిని కరోనా సంక్షోభంలోకి నెట్టిందని, వైరస్‌పై యుద్ధం చేయడానికి ప్రజల సహకారం కావాలన్నారు. ప్రతిసారీ మీరు తన మాట మన్నించారు.. తన మాట విన్నారని మోడీ గుర్తుచేశారు.

అభివృద్ధి చెందిన దేశాలే కరోనా బారిన పడ్డాయని, అలాంటిది మనదేశం కరోనాకు అతీతం అని చెప్పడం సరికాదని ప్రధాని వ్యాఖ్యానించారు. సంకల్పం, నిబద్ధత ఇప్పుడు చాలా అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనల్ని పూర్తిగా పాటించాలని మోడీ ప్రజలను కోరారు.

కరోనా మనకు రాకుండా చూడటంతో పాటు మనవల్ల ఇతరులకు సోకకుండా చూసుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత స్వేచ్ఛను పాటించాలని మోడీ కోరారు. సమూహాలకు దూరంగా ఉండాలని ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు.

సోషల్ డిస్టెన్సింగ్ ఇప్పుడు చాలా అవసరమని, రానున్న కొద్దివారాల పాటు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ప్రధాని చెప్పారు. వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఇంటి నుంచే చేయడానికి ప్రయత్నించాలని.. దేశంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కానీ కొన్ని రంగాల వారికి బయటకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 

ఛాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూ మనల్ని సంసిద్ధుల్ని చేస్తుందన్నారు. డాక్టర్లు, నర్సులు ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడుతున్నారని వారికి సైతం కరోనా సోకే ప్రమాదం ఉందని ప్రధాని తెలిపారు.

కరోనాకి, మనకి మధ్యలో వైద్యులు సైన్యంలా పనిచేస్తున్నారని మార్చి 22 ఆదివారం నాడు వీరందరికీ మనం కృతజ్ఞతలు చెప్పాలని మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాల పాటు మన ఇంట్లోనే కూర్చొని వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రధాని కోరారు.

Also Read:బ్రేకింగ్: భారత్‌లో నాలుగో కరోనా మరణం

వైద్యులకు వివిధ పద్ధతుల్లో అభినందనలు తెలపాలని, ఇంటి ముందు నిలబడి ఏదో ఒక రకంగా అభినందనలు చెప్పాలని మోడీ చెప్పారు. నిత్యవసర వస్తువులు ఎక్కడా ఆగిపోవని, అత్యవసర వస్తువుల్ని బ్లాక్ చేయొద్దని, వాటికి ఎలాంటి కొరత ఉండదని ప్రధాని స్పష్టం చేశారు.

 రోటీన్ చెకప్‌ల కోసం వైద్యల వద్దకు వెళ్లడం తగ్గించాలని అత్యవసరం కాకపోతేనే సర్జరీలు కూడా వాయిదా వేసుకోవాలని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల ఆర్ధిక సమస్యలు కూడా ఉన్నాయని.. వీటిని ఎదుర్కొనేందుకు టాస్క్‌ఫోర్స్‌ను నియమించామని మోడీ స్పష్టం చేశారు.

ఆర్ధిక మంత్రి ఆధ్వర్యంలో ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని, ఆర్ధిక సమస్యల తీవ్రతను తగ్గించడానికి ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుందని ప్రధాని తెలిపారు. ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్లని మానవత్వంతో చూడాలని, వాళ్లు పనికి రాలేకపోయిన పక్షంలో జీతాలు కట్ చేయొద్దని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.