ఒడిశాలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 280 మంది మృతి చెందినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఒడిశా వెళ్లాలని ప్రధాని  మోదీ నిర్ణయం తీసుకున్నారు.

ఒడిశాలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 280 మంది మృతి చెందినట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే.. ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ.. ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు ఒడిశా వెళ్లాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. తొలుత రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న ప్రధాని మోదీ.. ఆ తర్వాత కటక్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఇదిలా ఉంటే ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఒడిశాలో రైలు ప్రమాదం కలకలం రేపింది. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడాను. పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు. 

ఇక, ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించబడతాయి. ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుంది. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లపై ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ ప్రారంభిస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి గల కారణాలు విచారణ తర్వాత తెలుస్తాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్కడే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను అధికారులు వారికి వివరించారు.