ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. శుక్రవారం ఆయన ఛత్తీస్‌గడ్, యూపీలను పర్యటించిన ఆయన శనివారం ఉదయమే తెలంగాణకు వచ్చారు. అనంతరం, ఆయన రాజస్తాన్‌కు వెళ్లనున్నారు. యూపీ మినహాయిస్తే మిగిలిన మూడు రాష్ట్రాలు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నవే కావడం గమనార్హం. ఈ మూడు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. యూపీ సహా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఆయన పర్యటన చేస్తున్నారు. యూపీ, ఛత్తీస్‌గడ్‌లలో పర్యటించిన ప్రధాని మోడీ ఈ రోజు ఉదయం తెలంగాణకు వచ్చారు. వరంగల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వరంగల్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోడీ ప్రసంగించారు. అనంతరం ఆయన హకీంపేట్‌కు చేరుకుని రాజస్తాన్‌కు వెళ్లిపోతారు.

ప్రధానమంత్రి మోడీ శుక్రవారం ఛత్తీస్‌గడ్‌కు వెళ్లారు. అక్కడ సుమారు రూ. 7,600 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఛత్తీస్‌గడ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. గోరఖ్‌పూర్‌లో రెండు వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. మరికొన్నికార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ శనివారం ఉదయం తెలంగాణకు బయల్దేరి వచ్చారు. హైదరాబాద్ సమీపంలోని హకీంపేట్‌ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని మోడీ హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకున్నారు.

కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ కేంద్రానికి శంకుస్థాపన సహా సుమారు రూ. 6,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భద్రకాళి ఆలయానికి కూడా ప్రధాని మోడీ వెళ్లారు. 

Also Read: తెలుగులో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే?

విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పుల చెరిగారు. అనంతరం, ఆయన రాజస్తాన్‌కు వెళ్లనున్నారు. అక్కడా వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. నౌరంగ్‌దేసర్‌లో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాజస్తాన్‌లో సుమారు రూ. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. సొంత నియోజకవర్గం వారణాసి ఉన్న ఉత్తరప్రదేశ్ మినహాయిస్తే.. మిగిలిన మూడు రాష్ట్రాలూ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నవే కావడం గమనార్హం.