ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ నెల 12న ఏపీ, తెలంగాణలలో బహుళ ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. 11వ తేదీ ఉదయం కర్ణాటకలోని బెంగళూరులో మోదీ పర్యటించనున్నారు. ఉదయం 9:45 గంటలకు కవి శ్రీ కనక దాసు, వాల్మీకి మహర్షి విగ్రహాలకు ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 10:20 గంటలకు బెంగళూరులోని కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరవుతారు.
అనంతరం ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం చేరుకుంటారు. 11వ తేదీ రాత్రి ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. ఐఎన్‌ఎస్ చోళాలో ఆయన బస చేయనున్నారు. ఇక, నవంబర్ 12వ తేదీ ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి విశాఖపట్నంలో బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆయన తెలంగాణ బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణాలోని రామగుండంలో ఉన్న ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
ఏపీ పర్యటనలో మోదీ..
విశాఖ పర్యటలో భాగంగా ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి రూ. 10,500 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్నారు. ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్ విభాగానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ. 3750 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ ఎకనామిక్ కారిడార్ ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి విశాఖపట్నం పోర్ట్, చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి పారిశ్రామిక నోడ్స్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
విశాఖపట్నంలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు ప్రత్యేక పోర్ట్ రోడ్డుకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది విశాఖపట్నం నగరంలో స్థానిక, ఓడరేవుకు వెళ్లే గ్రూడ్స్ ట్రాఫిక్‌ను వేరు చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. శ్రీకాకుళం-గజపతి కారిడార్‌లో భాగంగా రూ. 200 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన NH-326Aలోని నరసన్నపేట నుంచి పాతపట్నం సెక్షన్‌ను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒఎన్‌జీసీ యు-ఫీల్డ్ ఆన్‌షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్‌ను మోదీ జాతికి అంకితం చేస్తారు ఇది రూ. 2900 కోట్లు కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయబడింది. రోజుకు సుమారు 3 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. అలాగే దాదాపు 6.65 ఎంఎంఎస్‌సీఎండీ సామర్థ్యంతో గెయిల్‌కు చెందిన శ్రీకాకుళం అంగుల్ సహజ వాయువు పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు మోదీ శంకుస్థాపన చేస్తారు. రూ. 2650 కోట్లకు పైగా వ్యయంతో 745 కి.మీ పొడవున్న ఈ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. నేచురల్ గ్యాస్ గ్రిడ్ (NGG)లో భాగంగా..ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని వివిధ జిల్లాల్లో గృహాలకు, పరిశ్రమలు, వాణిజ్య యూనిట్లు, ఆటోమొబైల్ రంగాలకు సహజ వాయువును సరఫరా చేయడానికి పైప్‌లైన్ కీలకమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు ఈ పైప్‌లైన్ సహజ వాయువును సరఫరా చేస్తుంది.
దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్ రోజుకు 75,000 మంది ప్రయాణీకులను సేవలను అందించేందుకు వీలుగా ఉండనుంది. ఆధునిక సౌకర్యాలను అందించడం ద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 150 కోట్లు. అప్‌గ్రేడేషన్, ఆధునీకరణ తర్వాత ఫిషింగ్ హార్బర్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని రోజుకు 150 టన్నుల నుంచి రోజుకు 300 టన్నులకు రెట్టింపు చేస్తుంది.
తెలంగాణలో మోదీ..
రామగుండం పర్యటలో భాగంగా ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి రూ. 9,500 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్‌కు 2016 ఆగస్టు 7వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. యూరియా ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలనే ప్రధాన మంత్రి ఆలోచన.. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణ వైపు అడుగు పడేలా చేసింది. రామగుండం ప్లాంట్ సంవత్సరానికి 12.7 LMT యూరియా ఉత్పత్తి చేస్తుంది.
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడింది. రూ. 6300 కంటే ఎక్కువ పెట్టుబడితో న్యూ అమ్మోనియా-యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను ఆర్‌ఎఫ్‌సిఎల్‌కు అప్పగించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్లాంట్‌కు జగదీష్‌పూర్-ఫుల్పూర్-హల్దియా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయబడుతుంది.
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని రైతులకు యూరియా ఎరువులు తగినంత, సకాలంలో సరఫరా అవ్వడంలో ఈ ప్లాంట్ కీలక భూమిక పోషించనుంది. ఈ ప్లాంట్ ఎరువుల లభ్యతను మెరుగుపరచడమే కాకుండా రోడ్లు, రైల్వేలు, అనుబంధ పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ఈ ప్రాంతంలో మొత్తం ఆర్థికాభివృద్ధిని కూడా పెంచుతుంది. ఆర్ఎఫ్‌సీఎల్ నుంచి ఉత్పత్తి చేసే ‘భారత్ యూరియా’ దిగుమతులను తగ్గించనుంది. అంతేకాకుండా సకాలంలో ఎరువులు సరఫరా చేయడం ద్వారా స్థానిక రైతులకు ప్రోత్సాహాం అందిస్తుంది.
ఇక, దాదాపు రూ. 1000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 2200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో NH-765DG మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, NH-161BB బోధన్-బాసర్-భైంసా విభాగం, NH-353C యొక్క సిరోంచ నుండి మహదేవ్‌పూర్ సెక్షన్‌లు ఉన్నాయి.
