Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ తో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా నిలించింది. మిషన్ చంద్రయాన్-3 విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆగస్టు 26న బెంగళూరుకు వెళ్లనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
PM Modi to visit Bengaluru-ISRO scientists: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బ్రిక్స్ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి ఆగస్టు 25న గ్రీస్ వెళ్లనున్నారు. గ్రీస్ నుంచి తిరుగు ప్రయాణంలో నరేంద్ర మోడీ బెంగళూరు వెళ్లనున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించనున్నారు. చంద్రయాన్ -3 మిషన్ కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ఆయన సన్మానించనున్నారు.
గ్రీస్ నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 6:00-6:30 గంటల వరకు విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించనున్నారు. అనంతరం ఉదయం 8:35 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని బయలుదేరుతారు. ఆయన విమానం 11:35కి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటుంది.
ఇస్రో చీఫ్ ను అభినందిస్తూ సోనియా గాంధీ లేఖ..
చంద్రయాన్-3 ల్యాండింగ్ పై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ను అభినందిస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కు లేఖ రాశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ను కలిసి చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ అయినందుకు అభినందించారు.
శాస్త్రవేత్తలకు డీకే శివకుమార్ అభినందనలు
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా ల్యాండ్ చేయడం అభినందనీయమని శివకుమార్ శాస్త్రవేత్తలకు తెలిపారు. "మీరు భారతదేశానికి గర్వకారణం. ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషి మరువలేనిది. ఇస్రో కృషికి అభినందనలు" అంటూ డీకే పేర్కొన్నారు.
