కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్న మోదీ.. డబుల్ ఇంజన్ సర్కార్‌తో కర్ణాటక అభివృద్ది సాధ్యమని చెబుతున్నారు. ఇక, మే 6వ తేదీన ప్రధాని మోదీ కర్ణాటకలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ 36.6 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించనున్నట్లు బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్ బుధవారం తెలిపారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో భాగంగా రోడ్‌షో బెంగళూరు నగరంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగుతుందని పీసీ మోహన్ చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10.1 కిలోమీటర్లు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు 26.5 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో ఉంటుందని మోహన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. మే 7వ తేదీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
అంతకుముందు ఏప్రిల్ 29 న ప్రధాని మోదీ బెంగళూరులో మాగడి రోడ్, నైస్ రోడ్ జంక్షన్, సుమనహళ్లి సహా నగరంలోని వివిధ ప్రాంతాల గుండా 5.3 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
