Omicron: భారత్‌లో 213కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. దేశంలో కరోనా పరిస్థితిపై రేపు ప్రధాని మోదీ సమీక్ష..
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్-19 సంబంధిత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం(డిసెంబర్ 23) రోజున సమీక్ష నిర్వహించనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్‌లో ఇప్పటివరకు 213 ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్-19 సంబంధిత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం(డిసెంబర్ 23) రోజున సమీక్ష నిర్వహించనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమీక్షలో ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, వ్యాక్సినేషన్, కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇక, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతన్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ (night curfew) పెట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కంటైన్‌మెంట్ జోన్లలో నైట్ కర్ఫ్యూ విధించాలని కోరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. వైరస్ కట్టడికి వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలని, ఫంక్షన్లు సహా వివిధ కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇక, దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, ఉత్తరప్రదేశ్ లో 2, ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్, లద్దాఖ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి. అయితే ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 90 మంది కోలుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక, గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 6,317 మందికి కరోనా నిర్దారణ అయిందని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,58,481 కి చేరింది. ఇదే సమయంలో కొత్తగా 6,906 మంది బాధితులు కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,42,01,966కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 78,190 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 4,78,325కు పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.4 శాతంగా ఉంది. మరణాల రేటు 1.35 శాతంగా ఉంది.