Narendra Modi : దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో నెలకొన్న ఎండల పరిస్థితులు, రాబోయే వర్షాకాలంపై సమీక్షా జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు.
heatwave, upcoming monsoon : దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. సంవత్సరాల క్రితం రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. అలాగే, దేశంలోని పలు చోట్ల అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. దీని కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగడంతో పాటు డజన్ల మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న వేడిగాలులు, ఎండల ప్రభావం మరియు రాబోయే వర్షాకాలాన్ని పరిస్థితులను ఎదుర్కోవటానికి సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. యూరప్ దేశాల మూడు రోజుల పర్యటన నుండి ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ వెంటనే కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు దాదాపు ఏడు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.
కాగా, వడగాడ్పుల ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాలు ఆల్-టైమ్ అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి. బుధవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన మరియు వర్షం కురిసింది. దీంతో మండుతున్న ఎండల నుంచి ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. అంతకు ముందు దేశరాజధాని రికార్డు స్తాయిలో ఉష్ణోగ్రతలను నమోదుచేసింది. 72 ఏండ్ల రికార్డు సైతం బ్రేక్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కురుస్తున్న వానల ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే, శుక్రవారం నుంచి స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఆదివారం నాటికి హీట్‌వేవ్ పరిస్థితులు తిరిగి వస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో ఇటీవలి వారాల్లో వందలాది అడవుల్లో మంటలు చెలరేగాయి. ధర్మశాల చుట్టుపక్కల ఉన్న పైన్ అడవులను కాల్చివేసాయి. హిమాచల్ ప్రదేశ్ సాధారణంగా సంవత్సరంలో ఈ సమయంలో అధిక ప్రాంతాల్లో వర్షం, వడగళ్ళు మరియు మంచును కూడా కూరుస్తుంది. అయితే, చాలా ప్రాంతాల్లో రెండు నెలల్లో ఎటువంటి అవపాతం కనిపించలేదు. ఇది సాధారణం కంటే ఎక్కువ మరియు పెద్ద మొత్తంలో మంటలను రేకెత్తిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. "అగ్నిమాపక సిబ్బంది బృందాలు ఈ మంటలను ఆర్పడానికి మరియు అడవి జంతువులను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి" అని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ అజయ్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలక వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, మంగళవారం, బుధవారం పలు చోట్ల వర్షం కురవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది.
అయితే, అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా వడగండ్ల వాన కురవడంతో పండ్ల తోటలు, కూరగాయల పంటలపై ప్రభావం పడింది. ఇదిలావుంటే ఈ సారి దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రత రికార్డుల మోత మోగించింది. అసాధారణంగా వేడిగా ఉన్న మార్చి మరియు ఏప్రిల్‌లలో విద్యుత్ డిమాండ్ రికార్డు గరిష్టనికి చేరుకుంది. దీని కారణంగా బొగ్గు నిల్వలు సరిపడా లేకపోవడం.. కొరత ఏర్పడి విద్యుత్ కొతలు మొదలయ్యాయి. దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రస్తుతం విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నాయి.