గంగా పుష్కరాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ‘‘కాశీ తెలుగు సంగమం’’ నిర్వహించనున్నారు. ఈ నెల 29న జరగనున్న కాశీ తెలుగు సంగమంలో మోదీ ప్రసంగించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న కాశీ తెలుగు సంగమంలో ప్రసంగించనున్నారు. గంగా పుష్కరాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ‘‘కాశీ తెలుగు సంగమం’’ నిర్వహించనున్నారు. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న 12 రోజుల సుదీర్ఘ గంగా పుష్కరాల సందర్భంగా తెలుగు మాట్లాడే యాత్రికులు వారణాసికి భారీ సంఖ్యలో చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. 

తెలుగువారితో ముడిపడి ఉన్న ఆశ్రమాలు, ధర్మశాలల సంస్థ శ్రీ కాశీ తెలుగు సమితి ‘సంగమం’ను నిర్వహిస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయన సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. గంగా నది మానస సరోవర్ ఘాట్ వద్ద జరిగే ఈ ఒకరోజు కార్యక్రమంలో వారణాసి నరగం, తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే రెండు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పురాతన నాగరికత సంబంధాలను హైలైట్ చేయనున్నారు. వివిధ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

‘‘గంగా పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది ప్రజలు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు, వివిధ పూజల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. ఇది చాలా పవిత్రమైన కాలం. అలాంటి వేలాది మంది యాత్రికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు’’ అని జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. రెండు ప్రాంతాల మధ్య పురాతన నాగరికత సంబంధాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేస్తారని అన్నారు. వారణాసి మతపరమైన, సాంస్కృతిక వారసత్వాన్ని మోదీ పునరుజ్జీవింపజేశారని అన్నారు. 

ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మూలాలను మరింత లోతుగా విస్తరించేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వారణాసిలో నెల రోజుల పాటు కాశీ తమిళ సంగమం కూడా నిర్వహించారు.