Narendra Modi: శిరసు వంచి నమస్కరిస్తున్నా... పీఎం మోడీ ట్వీట్ వైరల్!
నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించింది. నార్త్ ఇండియాలో సత్తా చాటింది. ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్పందించారు.
దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వర్గాల్లో జోష్ నెలకొంది. ఆ పార్టీ ఏకంగా మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ 166 సొంతం చేసుకుంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలకు 55 స్థానాలు గెలుపొందింది. ఇక రాజస్థాన్ లో 199 స్థానాల్లో పోటీపడి 115 గెలుపొందింది. తెలంగాణలో విజయం సాధించకున్నప్పటికీ ఓటు శాతం, సీట్లు పెంచుకుంది. 2018లో కేవలం 1 స్థానంలో గెలుపొందిన బీజేపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది.
ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని పీఎం నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ''ప్రజలకు అందించిన విజయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పలితాలతో ఒకటి స్పష్టం అయ్యింది. అభివృద్ధికి బాటవేసి సుపరిపాలన అందించే బీజేపీ ప్రభుత్వ కుటుంబ సభ్యులుగా ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ రాష్ట్రాల ప్రజల మద్దతుకు ధన్యవాదాలు. మీ సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. నిరంతరం కష్టపడుతున్న పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయులు! మన ప్రభుత్వ అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీరు విశ్రమించకుండా పనిచేశారు''. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ వైరల్ అవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయం సాధించి బీజేపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, హ్యాట్రిక్ నమోదు చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా పుంజుకున్న బీజేపీ రానున్న కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయం కానుంది.
తెలంగాణ ఎన్నికలపై కూడా నరేంద్రమోడీ స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ కోసం పని చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.