సారాంశం

Women Reservation Bill: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదించబడింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొంటూ దేశప్రజలకు అభినందనలు తెలిపారు.

Women Reservation Bill: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'నారీ శక్తి వందన్ బిల్లు' లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై స్లిప్ ద్వారా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. నూతన పార్లమెంట్ లో  ఆమోదించిన తొలి బిల్లు ఇదే. 

ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఇలా పోస్ట్‌ చేశారు. మహిళా కోటా బిల్లు ఆమోదం పొందడం పట్ల తాను సంతోషిస్తున్నానని, సహకరించిన ఎంపీ లకు పార్టీలకతీతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బిల్లుకు 454 మంది ఎంపీల మద్దతు లభించగా, కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఇటువంటి అద్భుతమైన మద్దతుతో లోక్‌సభలో రాజ్యాంగం (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు 2023 ఆమోదం పొందినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. ఈ బిల్లుకు మద్దతుగా నిలిచి..  ఓటు వేసిన ఎంపీలకు పార్టీలకతీతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని  అని పీఎం మోదీ పోస్ట్ చేశారు. నారీ శక్తి వందన్ బిల్లు అనేది ఒక చారిత్రాత్మక చట్టం, ఇది మహిళా సాధికారతను మరింత పెంపొందిస్తుంది. రాజకీయ ప్రక్రియలో మహిళలు మరింత ఎక్కువ భాగస్వామ్యానికి వీలు కల్పిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. "నారీ శక్తి వందన్ బిల్లు  లోక్‌సభ లో ఆమోదించబడింది. ఇది మన దేశానికి చారిత్రాత్మకమైన ముందడుగు.. ప్రధాని మోదీ ఊహించిన బిల్లు మహిళా సాధికారత చరిత్రలో కొత్తది మాత్రమే కాదు. అధ్యాయాన్ని వ్రాయడమే కాకుండా సమానమైన, లింగ-సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. మహిళల నేతృత్వంలోని పాలనకు మోదీ ప్రభుత్వ నిబద్ధతను ఇది మరోసారి పునరుద్ఘాటిస్తుంది." అని పోస్టు చేశారు. 

అంతకుముందు.. మహిళా సాధికారత అంశంపై ప్రపంచానికి అన్ని పార్టీలు ఐక్య సందేశాన్ని ఇవ్వాలని ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బిల్లుపై సూచనలను బహిరంగంగా ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైతే సవరించవచ్చునని ఆయన స్పష్టంగా సూచించారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాయ్‌బరేలీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా 60 మంది సభ్యులు లోక్‌సభలో 'నారీ శక్తి వందన్ బిల్లు'పై చర్చలో పాల్గొన్నారు. బిల్లుపై చర్చపై కేంద్ర మంత్రి మేఘ్వాల్ స్పందిస్తూ.. రాణి దుర్గావతి, రాణి చెన్నమ్మ, రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మి వంటి అసంఖ్యాక కథానాయికలను ప్రస్తావించారు.

విపక్షాలపై అమిత్ షా ఫైర్  

బిల్లును తీసుకురావాల్సిన సమయం, దాని అమలులో జాప్యం, ప్రభుత్వ రాజకీయ ఉద్దేశాల గురించి విపక్షాల ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి పదునైన బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శుల్లో ముగ్గురు కార్యదర్శులు మాత్రమే ఓబీసీలకు చెందినవారని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై షా స్పందిస్తూ.. దేశాన్ని సెక్రటరీ నడుపుతున్నారని కొంతమంది నమ్ముతున్నారని అన్నారు. దేశాన్ని ప్రభుత్వం, మంత్రివర్గం, పార్లమెంటు నిర్వహిస్తుందన్న అన్నారు.  లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా, లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు 'నారీ శక్తి వందన్ బిల్లు' అని పేరు పెట్టారు.

గురువారం రాజ్యసభలో 

లోక్‌సభలో బిల్లు ఆమోదానికి ముందు సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు, 2023పై గురువారం రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చకు ఏడున్నర గంటల సమయం కేటాయించారు.