సారాంశం

పాత పార్లమెంటు భవనం పేరును సంవిధాన్ సదన్‌గా పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలు చేశారు. పాత పార్లమెంటు భవన గౌరవాన్ని తక్కువ చేయరాదని, సంవిధాన్ సదన్ అనే పేరు పెట్టడం ద్వారా ఈ భవనంలో చరిత్ర లిఖించిన మన నాయకులకు నివాళిగానూ ఉంటుందని వివరించారు.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పాత పార్లమెంటు భవనానికి సంవిధాన్ సదన్ అనే పేరు పెట్టాలని సూచించారు. నూతన పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికి ముందు ఆయన ఈ ప్రతిపాదన చేశారు. పాత పార్లమెంటు భవన ప్రతిష్ట, కీర్తిని ఇసుమంతైనా తక్కువ చేయడానికి లేదని అన్నారు. ఈ భవనంలో 75 ఏళ్లపాటు సమావేశాలు జరిగాయని, ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ భవనం వేదిక అని వివరించారు. రాజ్యాంగం ఈ భవనంలోనే రూపుదిద్దుకుందని తెలిపారు. కాబట్టి, ఈ భవనాన్ని సునాయసంగా పాత పార్లమెంటు భవనం అనడం సరికాదని వివరించారు. దీని గౌరవాన్ని ఎప్పటిలాగే కొనసాగించాలని చెప్పారు. అందుకే ఈ భవనానికి సంవిధాన్ సదన్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని వివరించారు.

సంవిధాన్ సదన్ అనే పేరు ఈ పార్లమెంటు భవనంలో చరిత్ర లిఖించిన మన నాయకులకు నివాళిగా ఉంటుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ భవనాన్ని భావి తరాలకు బహుమానంగా ఇచ్చే అవకాశాన్ని కోల్పోరాదని వివరించారు. నూతన పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికి ముందు పాత పార్లమెంటు భవనంలో సెంట్రల్ హాల్‌లో ఆయన ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. నూతన పార్లమెంటులోకి మంగళవారం అంటే ఈ ఐదు రోజుల సమావేశాల్లో రెండో రోజున ప్రవేశిస్తున్నారు.

ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత ఎంపీలు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి నడుచుకుంటూ వెళ్లారు. అందరు ఎంపీలకు రాజ్యాంగం, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, సంస్మరణ నాణెం, ఓ స్టాంప్‌లతో కూడిన బ్యాగ్‌ను అందించారు. 

Also Read: భారత్, కెనడాల మధ్య విభేదాలు.. అమెరికా ఏమన్నదంటే?

నూతన పార్లమెంటు భవనానికి బదిలీ కావడంలో మరో మార్పును కూడా మనం చూడొచ్చు. పార్లమెంటు స్టాఫ్ యూనిఫామ్‌లను మార్చారు. ఉభయ సభల్లోనూ మారిన యూనిఫామ్‌తో స్టాఫ్ కనిపిస్తారు.