ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ప్రధాని ముందే ఎస్‌సీవో సమావేశానికి అధ్యక్షత వహిస్తూ విమర్శలు సంధించారు.
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ సమావేశం మంగళవారం వర్చువల్‌గా జరిగింది. ఈ వర్చువల్ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సహా పలువురు ఎస్‌సీవో సభ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించారు.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై నిప్పులు చెరిగారు. పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూనే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందే ధ్వజమెత్తారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదమే తమకు కీలక విధానంగా అవి మార్చుకుంటున్నాయని తీవ్ర ఆరోణలు చేశారు.
ఉగ్రవాదాన్ని ఏ దేశమూ అంగీకరించరాదనీ, ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడంలో ఈ కూటమి తటపటాయించబోదని స్పష్టం చేశారు.
Also Read: PM Modi: తెలంగాణకు ప్రధాని మోడీ పర్యటన.. టూర్ షెడ్యూల్ పై అధికారిక ప్రకటన
ఉగ్రవాదం ప్రాంతీయ శాంతికి, ప్రపంచ శాంతికీ ముప్పుగా మారిందని అన్నారు. ఈ ఉగ్రవాదంపై మరింత కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని పిలుపునిచ్చారు.
