అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్నవారితో కలిసి మోదీ యోగాసనలు వేశారు. 

యోగా ఇకపై జీవితంలో భాగం కాదని.. అది ఒక జీవన విధానంగా మారుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్నవారితో కలిసి మోదీ యోగాసనలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్రం మంత్రి Sarbananda Sonowal, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యోగా అనేది సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. అంతర్గత శాంతిని కలిగిస్తుందని అన్నారు. ‘‘యోగా నుంచి శాంతి కేవలం వ్యక్తులకు కాదు. యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది. యోగా మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతేకాకుండా యోగా మన విశ్వానికి శాంతిని కలిగిస్తుంది’’ అని ఆయన అన్నారు.

‘‘మనం ఎంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నప్పటికీ.. కొన్ని నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని రిలాక్స్ చేస్తుంది. మన ఉత్పాదకతను పెంచుతుంది. కాబట్టి మనం యోగాను అదనపు పనిగా పరిగణించకూడదు. మనం యోగా గురించి తెలుసుకోవాలి.. యోగాతో జీవించాలి.. దానిని మన సొంతం చేసుకోవాలి" అని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. యోగా ఇప్పుడు జీవితంలో ఒక భాగం కాదు.. కానీ అది ఒక జీవన విధానంగా మారుతోందని పేర్కొన్నారు.

‘‘ఈ విశ్వం మొత్తం మన సొంత శరీరం, ఆత్మ నుంచి మొదలవుతుంది. విశ్వం మన నుంచి మొదలవుతుంది. యోగా మనలోని ప్రతిదాని గురించి మనకు స్పృహ కలిగిస్తుంది. అలాగే అవగాహనను పెంపొందిస్తుంది" అని ప్రధాన మోదీ అన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచదేశాలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా విస్తరించిందని అన్నారు. 

ఇక, 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం యొక్క థీమ్ "యోగా ఫర్ హ్యుమానిటీ". ఈ ఏడాది యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా.. 75 మంది కేంద్ర మంత్రులు దేశంలోని 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.