కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టేలా బీజేపీ పావులు కదుపుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో ఏన్డీయే కూటమి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.

న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టేలా బీజేపీ పావులు కదుపుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో ఏన్డీయే కూటమి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే పార్టీల నేతల సమావేశం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ.. ఎన్డీయే పార్టీల ఎంపీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి రానున్నఎన్నికలకు సంబంధించి మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోదీ మంగళవారం పశ్చిమ ఉత్తర ప్రదేశ్, బ్రజ్, కాన్పూర్-బుందేల్‌ఖండ్ ప్రాంతాలకు చెందిన ఎన్డీయే ఎంపీలతో సమావేశమయ్యారు. 

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రామమందిరం మాత్రమే కాకుండా ఇతన స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని కూడా సూచించారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలతో స్థానిక సమస్యల గురించి మాట్లాడాలని, ప్రజలు పాల్గొనే పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వంపై కాస్త కోపంగా ఉన్నవారితో ఎక్కువగా మాట్లాడి, వారికి నచ్చజెప్పాలని సూచించారు. 

అదే సమయంలో సంకీర్ణ ధర్మాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. యూపీఏ మాదిరిగా కాకుండా ఎన్‌డీఏ త్యాగాలు చేస్తుందని అన్నారు. ఎన్డీయేకు స్వార్థం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గతంలోని పలు అంశాలను ప్రస్తావించినట్టుగా సంబంధిత మూలాలు తెలిపాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఉదహరించిన ప్రధాని మోదీ.. బీజేపీ కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నితీష్‌ను ముఖ్యమంత్రిని చేశామని, అయితే ఆయన సంకీర్ణాన్ని ముగించి ప్రతిపక్ష శ్రేణిలో చేరారని అన్నారు. అదే విధంగా, పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తు ఉన్న సమయంలో మంచి సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఉప ముఖ్యమంత్రి పదవిని కోరలేదని చెప్పారు. 

ఇక, ఎన్డీయేలోని 430 మంది ఎంపీలను బీజేపీ 11 గ్రూపులుగా విభజించి.. ఆగస్టు 10 వరకు ప్రధాని మోదీని కలిసేలా ప్రణాళిక రచించింది. ఇక, పలు రాష్ట్రాల నుంచి 96 మంది ఎంపీలు పాల్గొనే తదుపరి రౌండ్ సమావేశాలు బుధవారం జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు భాగం కానున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమిలో మరింత సమన్వయం కోసం ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.