కరుణానిధి కుటుంబం బాగుండాలంటే  డీఎంకేకు ఓటేయండి.. కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే..బీఆర్‌ఎస్‌కు ఓటేయండి.. మీ కొడుకులు, కూతుళ్లు, మనవళ్ల సంక్షేమం కోరుకుంటే..బీజేపీకి ఓటు వేయండని ప్రధాని మోదీ అన్నారు.

కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘మేరా బూత్‌.. సబ్‌సే మజ్‌బూత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శస్త్రాలను సంధించారు. "మీరు కరుణానిధి కుటుంబ బాగుండాలంటే.. డిఎంకెకు ఓటు వేయండి. సీఎం కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే.. బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. మీరు మీ కుమారులు, కుమార్తెలు , మనవళ్ల సంక్షేమాన్ని కోరుకుంటే.. మాత్రం బీజేపీకి ఓటు వేయండి" అని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ.

'2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయి. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలతో ముడిపడి ఉన్నాయి. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ పేర్కొన్నారు. తాము ఏసీ రూమ్ ల్లో కూర్చుని ఆదేశాలు జారీ చేయమనీ, ప్రజలకు చేరువగా ఉంటూ.. వారికి ధైర్యంగా ఉంటామని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటామని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మృదువుగా వ్యవహరిస్తుందనే ఊహాగానాలు పెల్లుబిక్కుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌తో సంబంధం ఉన్న కె కవితను అరెస్టు చేయకపోవడంపై బీజేపీలోని ఒక వర్గం నాయకులను అసంతృప్తిగా ఉంది. ఈ వాదనలకు ఊతమిస్తూ.. గత రెండేళ్లుగా BRS పార్టీ కేంద్ర సమావేశాలను బహిష్కరించి, మణిపూర్ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశానికి హాజరైంది. అలాగే.. విపక్షాలు పాట్నాలో వ్యూహాత్మక సమావేశం నిర్వహిస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. ఈ పరిణామం కూడా పలు విమర్శలకు తావిచ్చింది. బిజెపి, బిఆర్‌ఎస్ లు ఓ అండర్ స్టాండింగ్ పై సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ అసంతృప్తి నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన 35 మంది కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారనేది పొలిటికల్ టాక్. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీని కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడినట్టు తెలుస్తోంది.