పాత పార్లమెంట్ భవనం చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని  ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారేందుకు భారత్ ముందుకు సాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.మంగళవారంనాడు పార్లమెంట్ సెంట్రల్ హల్ లో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ టాప్ 3లో నిలువనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత పరిపాలన విధానం,యూపీఐ వంటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు.ఈ సమున్నత సమయంలో ఎంపీలుగా మనం కొనసాగడం మన అదృష్టమని మోడీ అభిప్రాయపడ్డారు. బానిసత్వపు సంకెళ్లు ఇన్నాళ్లపాటు మన కలలను బంధించాయన్నారు. ఇదే పార్లమెంట్ భవనంలో ట్రిపుల్ తలాక్ బిల్లునేు ఆమోదించుకున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.ట్రాన్స్ జెండర్లకు న్యాయం చేసే బిల్లును కూడ ఇక్కడే రూపొందించామన్నారు.దివ్యాంగుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడే అనేక చట్టాలను తయారు చేసుకున్న విషయాన్ని మోడీ ప్రస్తావించారు. ఉగ్రవాదానికి, వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా పోరాటాలను ప్రధాని వివరించారు. సరికొత్త చైతన్యంతో భారత్ ఇప్పుడు పునర్వికాసం పొందిందని ప్రధాని చెప్పారు.

ఈ పార్లమెంట్ భవనం, సెంట్రల్ హాల్ మన భావోద్వేగాలతో ముడిపడిన ప్రాంతంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.ఒకప్పుడు ఈ ప్రాంగణం లైబ్రరీగా ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత ఈ ప్రాంగణం రాజ్యాంగ సభగా మారిందన్నారు.మన రాజ్యాంగం ఇక్కడే రూపుదిద్దుకున్న విషయాన్ని మోడీ ప్రస్తావించారు.ఈ ప్రాంగణంలోనే మనం జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను ఎంచుకున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.ఈ సెంట్రల్ హాల్ లో 41 దేశాల అధినేతలు ప్రసంగించారన్నారు. అంతేకాదు 86 దఫాలు రాష్ట్రపతులు ఇదే వేదిక నుండి ప్రసంగించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.అనేక చట్టాలు, చర్చల్లో ఎందరో భాగస్వామ్యులయ్యారన్నారు.4 వేలకు పైగా చట్టాలను పార్లమెంట్ లో ఆమోదించామన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేసే అదృష్టం మనకు ఈ సభ ద్వారానే దక్కిందన్నారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్ శాంతి పథంలో ప్రయాణం చేస్తుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.

అత్యధిక యువత ఉన్న దేశం కూడ మనదేనన్నారు ప్రధాని మోడీ. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఉండాల్సిన అవసరం ఉందని మోడీ నొక్కి చెప్పారు. నైపున్య మానవ వనరులు ప్రపంచానికి అవసరమన్నారు.ప్రపంచంలో మన యువత అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం కూడ మనదేనన్నారు. ఇటీవలనే కొత్తగా 150 నర్సింగ్ కాలేజీలను ప్రకటించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. రాజకీయాల కోసం కొన్ని నిర్ణయాలను వాయిదా వేయకూడదన్నారు.నాణ్యతపై ఫోకస్ చేయాలని ప్రధాని యువతకు సూచించారు. భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.చిన్న కాన్వాస్ పై పెద్ద బొమ్మ గీయలేమన్నారు.ఇకపై మనం పెద్ద కాన్వాస్ ను ఉపయోగించాలన్నారు.మన ఆలోచనలు కూడ ఉన్నతంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు.

ప్రపంచమంతా ఆత్మనిర్భర్ భారత్ గురించే చర్చిస్తుందన్నారు. భారత యూనివర్శిటీలు ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త జాతీయ విద్యా విధానాన్ని తెచ్చుకున్న విషయాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.