ప్రధాని నరేంద్ర మోదీ కి అరుదైన గౌరవం దక్కింది. మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... దీనికి గాను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆయనకు ‘ గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది తనకు ఒక్కడికే దక్కిన గౌరవం కాదని... యావత్ భారతీయులందరిదని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కావడానికి కారణమైన యావత్ భారతీయులందరికీ ఈ గౌరవం దక్కుతుందని మోదీ అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకోనున్న సంవత్సరంలోనే తనకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. వ్యక్తిగతంగా ఈ అవార్డు తనకు చాలా ముఖ్యమైనదని మోదీ చెప్పారు.

గత ఐదు సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా 11కోట్ల మరుగుదొడ్లు కట్టించినట్లు చెప్పారు. ఈ పథకం వల్ల ఎవరికైనా లాభం చేకూరుతుందంటే ముఖ్యంగా స్త్రీలకేనని అన్నారు. ఇంతకాలం మహిళలు, ఆడపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా బడి కి వెళ్లడం మానేసిన బాలికలు కూడా ఉన్నారని మోదీ చెప్పారు. మహాత్మాగాంధీ కలలు కన్న పరిశుభ్రమైన భారత్ ను అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.