పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు.
ఈ ఘటన విచారకరమైందన్నారు. ఈ విషయమై లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తైన రోజునే లోక్ సభలోకి ఇద్దరు ఆగంతకులు దూకారు. ఒకరు లోక్ సభలో కలర్ స్మోక్ ను వదిలారు. పార్లమెంట్ భవన్ వెలుపల ఇద్దరు కలర్ స్మోక్ వదిలారు.ఈ నలుగురిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. ఈ నెల 13వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. లోక్ సభలో జీరో అవర్ సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుండి లోక్ సభ చాంబర్ లోకి దూకి కలర్ స్మోక్ ను ఓ ఆగంతకుడు విడుదల చేశాడు. అంతేకాదు నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఎందుకు చేశారో అర్ధం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఈ ఘటన లోతుల్లోకి వెళ్లి మళ్లీ అలా జరగకుండా పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చెప్పారు.
ఈ సంఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కుట్ర బట్టబయలు అవుతుందని తాము విశ్వసిస్తున్నామని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు. ఈ ఘటన వెనుక నిందితుల ఉద్దేశం ఏమిటో దీని వెనుక ఏయే అంశాలు పనిచేశాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ఘటన తర్వాత విజిటర్స్ కు పాసులు జారీ చేసే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు.ఈ ఘటనపై లోతైన విచారణ కోసం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.
