న్యూడిల్లి: దేశవ్యాప్తంగా వున్న అందరు రైతుల మేలు కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి వుందన్నారు. అన్నదాతలకు అండగా నిలిచేలా కేంద్రం చట్టాలను రూపొందిస్తుందని... అయితే కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతులను ఆందోళనకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. రైతులు ఇలాంటి వారి మాయమాటలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. 

ఇవాళ(సోమవారం)రాజ్య‌స‌భ‌లో రాష్ర్ట‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా మోదీ మాట్లాడారు.''అసలు రైతుల ఆందోళన ఎందుకో అర్థం కావడం లేదు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆందోళనకు దిగిన రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపింది. తాము తీసుకువచ్చిరన వ్యవసాయ చట్టాలపై అభ్యంతరాలు ఏమిటో చెప్పడం లేదు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి సిద్దంగా వున్నాం'' అన్నారు.

''శరత్ పవార్ గతంలో వ్యవసాయ సంస్కరణలను స్వాగతించారు. కానీ ఆయన కూడా ఇప్పుడు వ్యవసాయి చట్టాలకు అభ్యంతరం చెబుతున్నారు. వ్యవసాయి సంస్కరణలపై గత ప్రభుత్వాలు కూడా హామీ ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలపై యూ టర్న్ తీసుకున్నారు'' అని ప్రధాని పేర్కొన్నారు. 

read more   ప్రధాని నోట మరోసారి సర్జికల్ స్ట్రైక్... రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడుతూ...

''రైతుల మేలు కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చాం. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యవసాయ సంస్కరణలు అవసరమని అన్నారు. అలా ఆయన చెప్పిందే ఇప్పుడు మోదీ చేస్తున్నారని గర్వపడండి'' అంటూ కాంగ్రెస్ నాయకులకు చురకలు అంటించారు.

''చిన్న తరహా రైతులకు గతంలో మాజీ ప్రదాని చౌదరి చరణ్ సింగ్ అండగా నిలిచారు. అంతేకాకుండా లాల్ బహదూర్ శాస్త్రి కూడా అన్నదాతల కోసం అనేక వ్యవసాయ సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు కూడా ఇలాగే ఆయన విమర్శలపాలయ్యారు. అమెరికా ఆదేశాలతోనే శాస్త్రి ఇలా చేసేవారని... ఆయనను అమెరికా ఏజెంట్లు అనే వారని గుర్తుచేశారు.  కానీ శాస్త్రి ఏనాడు తన నిర్ణయాలపై వెనకడుగు వేయలేదన్నారు. తాము కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాం'' అని మోదీ తెలిపారు. 

''కరోనా లాక్ డౌన్ సమయంలోనూ భారత్ లో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పాదన జరిగింది.  కాబట్టి వ్యవసాయ సంస్కరణల విషయంలో  ప్రతిపక్షాలు కూడా కేంద్రంలో కలిసిరావాలన్నారు. ఇందులో ఏదయినా తప్పు జరిగితే నా ఖాతాలో వేయండి...మంచి జరిగితే మీ ఖాతాలో వేసుకోండి. కానీ రైతులను తప్పదారి పట్టిన ఇలా ఆందోళనలను రేకెత్తించడం సరికాదు'' అని సూచించారు.

''వ్యవసాయి చట్టాలపై చర్చించేందుకు రైతు సంఘాలకు ఇంకా ద్వారాలు తెరుచుకునే వున్నాయి. రైతులు పండించే పంటలకు మద్దతు ధర గతంలో వుండేది..ఇప్పుడు వుంది.. భవిష్యత్ లోనూ వుంటుంది. రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం తాము వ్యవసాయ చట్టాలు చేశాం'' అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.