'వారి సేవలు స్ఫూర్తిదాయకం': ప్రధాని మోడీ
భారతదేశ చరిత్రలో అత్యంత వినాశకరమైన రైలు ప్రమాదాలలో ఒకటైన ఒడిశాలోని బాలాసోర్‌లో రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పౌరులు,సిబ్బంది,వాలంటీర్లకు ప్రధాని మోడీ ధన్యావాదాలు తెలిపారు. వారి ధైర్యం, చురుకుదనం,కరుణను ప్రధాని ప్రశంసించారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన సిబ్బంది కృషిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అలాగే వారి ధైర్యాన్ని, కరుణను కొనియాడారు. తమ సంతాప సందేశాలకు ప్రపంచ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై ప్రపంచ నాయకుల సంతాప సందేశాలు నన్ను తీవ్రంగా కదిలించాయని ఆయన రాశారు. వారి సానుభూతి బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిస్తుంది. మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రెస్క్యూ సిబ్బంది , ఇతర అధికారులను ప్రశంసిస్తూ, ప్రధాని మోడీ ఇలా రాశారు. క్షేత్ర స్థాయిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న రైల్వే, NDRF, ODRAF, స్థానిక అధికారులు, పోలీసు, అగ్నిమాపక సేవ, వాలంటీర్లు, ఇతరుల బృందాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. వారి అంకితభావానికి గర్విస్తున్నాను. విపత్తుల సమయంలో దేశ ప్రజలు చూపుతున్న ధైర్యం, కరుణ నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రధాని అన్నారు. ఒడిశాలో రైలు ప్రమాదం తర్వాత స్థానికులు సహాయక చర్యలకు ముందుకు వచ్చారు. రక్తదానం చేసేందుకు చాలా మంది బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరారని పేర్కొన్నారు. కటక్‌లోని SCB మెడికల్ కాలేజ్ డాక్టర్ జయంత్ పాండా మాట్లాడుతూ..గత రాత్రి నుండి కటక్, బాలాసోర్, భద్రక్‌లలో 3000 యూనిట్లకు పైగా రక్తం సేకరించబడిందని తెలిపారు.
ప్రధాని మోడీ ప్రమాద స్థలాన్ని సందర్శించి, బాలాసోర్ జిల్లాలోని ఆసుపత్రిలో క్షతగాత్రులను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన బాధను చెప్పడానికి పదాలు దొరకడం లేదని అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎవరినీ విడిచిపెట్టబోమని, ఈ దుర్ఘటనలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రమాదంపై సరైన , వేగవంతమైన దర్యాప్తు చేయడానికి తగిన సూచనలు ఇవ్వబడ్డాయని ప్రధాని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని తీసుకురావడం సాధ్యం కాదని, అయితే వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని అన్నారు. గాయపడిన వారికి అన్ని విధాలా వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. ఈ రైలు ప్రమాదం దేశానికే గుణపాఠం కానుందని, ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం మరింత ఒత్తిడి తెస్తుందని అన్నారు.
రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో ఒడిశా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. రక్తదానం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానికులను, గాయపడిన వారికి సహాయం చేయడానికి వచ్చిన వాలంటీర్లను ఆయన ప్రశంసించారు. వైమానిక దళం హెలికాప్టర్‌లో ఇక్కడికి చేరుకున్న తర్వాత, ప్రధాని మోదీ బహనాగా వద్ద ప్రమాద ప్రదేశాన్ని సందర్శించి, సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలను పరిశీలించారు. ఆయన వెంట రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్రానికి చెందిన ఎంపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి: శరద్ పవార్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. గతంలో రైలు ప్రమాదం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారని ఉదహరించారు. శనివారం పూణెలో మీడియాతో మాట్లాడిన పవార్.. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. ఆయన తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు. కాగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజీనామా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ , అది తన నైతిక బాధ్యత అని శాస్త్రి అన్నారు. ఈరోజు దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ అధినేత
సూచించారు.