టీకా తయారీదారులతో ప్రధాని భేటీ.. ‘నరేంద్ర మోడీకి థాంక్స్’
దేశవ్యాప్తంగా ఉన్న ఏడు టీకా తయారీ కంపెనీల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. దేశంలో అర్హులైనవారందరికీ వీలైనంత తొందరగా టీకా అందించడానికి కృషి చేయాలని ప్రధాని మోడీ టీకా కంపెనీలకు సూచించారు. దీనికోసం సలహాలు, సూచనలనూ అడిగారు. టీకాలకు అనుమతి ప్రక్రియను ప్రధాని మోడీ వేగవంతం చేశారని టీకా తయారీదారులు హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీకా పంపిణీ నిర్విగ్నంగా కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితమే వంద కోట్ల డోసుల పంపిణీ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా విదేశాలు భారత్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వంద కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు దేశంలోని ఏడు టీకా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, జైడస్ కాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనేసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో భేటీ అయ్యారు.
వీలైనంత త్వరగా దేశంలో అర్హులైనందరికీ టీకా పంపిణీ చేసే ఆవశ్యకతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశంలో ప్రస్తావించారు. అది సాధ్యం చేయడానికి సలహాలు, సూచనలనూ అడదిగారు. అంతేకాదు, టీకా పంపిణీ చేస్తున్న ఇతర దేశాలకూ వీలైన మేరకు సహకరించాలని, అందరికీ టీకా అనే మంత్రాన్ని పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ కూడా హాజరయ్యారు.
Also Read: కొత్త చరిత్ర సృష్టించాం,ప్రపంచం చూపు మనవైపే : 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీపై మోడీ
ఈ సమావేశంలో టీకా కంపెనీ అధినేతలు, ప్రతినిధులు ప్రధానమంత్రి మోడీపై ప్రశంసలు కురిపించారు. కరోనా టీకాలకు అనుమతులు ఇవ్వడానికి రెగ్యులేటరీ అధికారులను వేగంగా కదిలించడంలో ప్రధాని నరేంద్ర మోడీ సఫలమయ్యారని సీరం ఇన్‌స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా ప్రశంసించారు. టీకా పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సహించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు అని జైడస్ కాడిలా చైర్మన్ పంకజ్ పటేల్ పేర్కొన్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించామని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాల తెలిపారు. అంతేకాదు, భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కోవడానికి టీకా పరిశ్రమను సన్నద్ధం చేయడంపైనా మాట్లాడినట్టు వివరించారు.
Also Read: భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు.. భారతీయులకు కంగ్రాట్స్
ఈ నెల 21న దేశంలో 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన సంగతి తెలిసిందే. నేటికి దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన డోసుల సంఖ్య 101.3 కోట్లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జనవరి 16న మనదేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.