ప్రతి భారతీయుడి చెంతకు AI : మోదీ, సత్య నాదెళ్ల భేటీలో ప్లాన్ రెడీ
భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఈవో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు, AI టెక్నాలజీ గురించి వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి.
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులతో సహా పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు. ఈ సందర్భంగా మోదీ ఎక్స్ లో ఈ భేటికి సంబంధించిన వివరాలను తెలియజేసారు. "సత్య నాదెళ్లను కలవడం ఆనందంగా ఉంది. భారత్‌లో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది. టెక్నాలజీ, ఆవిష్కరణలు, AI గురించి చర్చించాం" అంటూ ప్రధాని ట్వీట్ చేసారు.
సత్య నాదెళ్ల కూడా ప్రధానితో భేటీపై ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. "ప్రధాని మోదీ నాయకత్వానికి ధన్యవాదాలు. AIలో భారత్‌ను ముందంజలో నిలపడానికి, దేశంలో మా విస్తరణ కొనసాగించడానికి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. AI వల్ల ప్రతి భారతీయుడు లబ్ధి పొందేలా చూస్తాం" అంటూ సత్య నాదెళ్ల ట్వీట్ చేసారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో మోదీ భేటీ
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్ లో "భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం టెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, AI రంగాల్లో కొత్త శిఖరాలకు చేరుకుంది. ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నాం" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు.
జనవరి 5-6 తేదీల్లో సుల్లివన్ భారత్‌లో పర్యటించారు. పదవీ విరమణకు ముందు ఆయన చేసిన చివరి విదేశీ పర్యటన ఇది. సుల్లివన్ భారత ప్రధానితో పాటు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో కూడా భేటీ అయ్యారు.