న్యూఢిల్లీ:  జిల్లాల్లో మీరు గెలిస్తే దేశం గెలిచినట్టేనని ప్రధాని మోడీ చెప్పారు. కరోనా పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడారు. జిల్లాల పరిస్థితులు స్థానికంగా ఉన్న అధికారులకే బాగా తెలుసునని ఆయన చెప్పారు.ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది, మరికొన్ని రాష్ట్రాల్లో  కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. కేసులు తగ్గుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మోడీ సూచించారు.  ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడమే  మన ధ్యేయంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 

కరోనాతో జరుగుతున్న యుద్దంలో మీరంతా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు.  ఒక విధంగా చెప్పాలంటే ఈ యుద్దానికి ఫీల్డ్ కమాండర్లు అంటూ మోడీ చెప్పారు. గత ఏడాది కరోనా సమయంలో  విధించిన లాక్ డౌన్ లో వ్యవసాయరంగాన్ని మినహాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పొలాల్లో ప్రజలు ఏ రకంగా భౌతిక దూరాన్ని పాటించారో చూసి తాను ఆశ్చర్యపోయాయని ఆయన చెప్పారు. గ్రామాల నుండి సమాచారాన్ని తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా సవరించుకొంటున్నట్టుగా మోడీ చెప్పారు.