న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు ప్రధానమంత్రి గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణ పనులను పురస్కరించుకొని గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ నిర్వహించారు.

also read:నూతన పార్లమెంట్ భవనానికి నేడు మోడీ శంకుస్థాపన: 100 ఏళ్లకు సరిపడేలా నిర్మాణం

వచ్చే 100 ఏళ్లకు సరిపడేలా కొత్త భవనంలో సౌకర్యాలను కల్పించనున్నారు. రాజ్యసభ, పార్లమెంట్ లతో పాటు ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు పలువురు మంత్రుల కార్యాలయాలను కూడ ఏర్పాటు చేయనున్నారు. 2022 చివరి వరకు  పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

నాలుగు అంతస్థుల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. రూ.971 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం పక్కనే ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

కొత్త పార్లమెంట్ భవనంలో 888 మంది సభ్యులు కూర్చొనేలా సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు.రాజ్యసభలో384 మంది కూర్చునేలా సీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని కేంద్రం తొలుత భావించింది. అయితే సెంట్రల్ విస్టా నిర్మాణంపై సుప్రీంకోర్టులో కేసు ఉంది. షరతులతో భూమి పూజకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

దీంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా కేంద్రం నిర్వహించింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రతన్ టాటా, విదేశీ రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.