ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు 15వ కొడుకు అని మధ్యప్రదేశ్‌కు చెందిన మంగిబాయ్ తన్వర్ పేర్కొన్నారు. తన పేరిట ఉన్న 15 ఎకరాల భూమిని మోడీకి రాసిస్తానని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదరణ గణనీయంగా పెరిగింది. యువతతోపాటు మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఆయనకు విపరీతమైన ఆకర్షణ ఉన్నది. ప్రధాని మోడీ సమయం దొరికితే తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకునేవారు. కానీ, ఆమె ఇటీవలే మరణించింది. దగ్గరుండి ఆమె ఖర్మక్రతువులు మోడీ చేయించారు. అయితే.. ఇప్పుడు మరో అమ్మ తెరపైకి వచ్చారు. మోడీ నా 15వ కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గడ్ జిల్లాలో హరిపురా గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్ పై మాటలు చెప్పారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ పర్యటనకు ముందు ఈ వీడియో సంచలనం సృష్టించింది.
ప్రధాని మోడీ దేశం కోసం ఎంతో శ్రమిస్తున్నారని మంగీబాయి తన్వర్ అన్నారు. తన కోసం కూడా అంటే చాలా మంది వృద్ధులకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక దన్ను ఇస్తున్నారని ప్రశంసించారు. వృద్ధులకు ఆహారం, వసతి కల్పిస్తున్నారని, ఉచితంగా వైద్యం అందిస్తున్నారనీ చెప్పారు. వితంతు పింఛన్ ఇప్పిస్తున్నారని, తద్వార ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు.
ఈ పథకాల ద్వారానే తాను తీర్థయాత్రలకు వెళ్లగలిగానని ఆమె చెప్పారు. అందుకే తాను మోడీని తన కొడుకు అని భావిస్తున్నట్టు వివరించారు. తనకు 14 మంది పిల్లలు ఉన్నారని చెప్పిన ఆమె మోడీ తనకు 15వ కొడుకు అని తెలిపారు. తన పేరిట 25 బిగాలు (15 ఎకరాలు) భూమి ఉన్నదని పేర్కొన్నారు. ఆ భూమిని ప్రధాని మోడీకి రాసిస్తానని ఆమె హామీ ఇవ్వడం సంచలనం సృష్టించింది.
