ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గతంలో పొత్తుపెట్టుకున్నప్పుడు టీడీపీ పెట్టిన ఇబ్బందిని తాము మరిచిపోలేదని అన్నారు. జనసేన, టీడీపీ పొత్తు గురించి ప్రస్తావించగా.. అది చంద్రబాబునే అడగాలని సూచించారు. 

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయమై కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడారు. తెలుగు దేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పొగడ్తలు కురిపిస్తూ బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. తిరుపతి జిల్లాలో ఈ రోజు ఆయన విలేకరుల మాట్లాడుతూ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు.

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పారిచెర్లవారిపాళెంలో ఉపాధి హామీ పథకం పనులు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి దేవూసిన్హ్ చౌహాన్‌ పరిశీలించారు. ఆయన వెంటే సోము వీర్రాజు కూడా వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం, సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని సోమువీర్రాజు స్పష్టం చేశారు. అయితే, జనసేనతో మాత్రం కలిసి అడుగేస్తామని వివరించారు. జనసేన, టీడీపీ పొత్తు గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆ ప్రశ్న చంద్రబాబునే అడగాలని సూచించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, తమను ఆ సంక్షేమ పథకాలే అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే.. తెలంగాణ కూడా దక్కదు: సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు

గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నప్పుడు తమను ఇబ్బంది పెట్టారని, ఆ విషయాన్ని తాము ఇంకా మరిచిపోలేదని ఆయన తెలిపారు. కేంద్రంలోని పెద్దలు కూడా చంద్రబాబుతో పొత్తు అంటే విముఖంగా ఉన్నారని వివరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఇచ్చిందని, కానీ, ఆ నిధులను చంద్రన్న బాట పేరుతో ఖర్చు పెట్టారని ఆరోపించారు. అంతేకాక, బీజేపీ ఏమీ ఇవ్వలేదని అన్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని, కేవలం ప్యాకేజీ చాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబే కోరారని సోమువీర్రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మించారని అన్నారు.