ఆపరేషన్ కావేరి కింద సుడాన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తీసుకురాబడిన కర్ణాటకకు చెందిన హక్కీ పిక్కీ గిరిజనులతో ప్రధాని మోదీ సంభాషించారు.
బెంగళూరు: సూడాన్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి కింద స్వదేశానికి సురక్షితంగా తరలించిన సంగతి తెలిసిందే. అలా ఆపరేషన్ కావేరి కింద సుడాన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చినవారిలో కర్ణాటక హక్కీ పిక్కీ తెగకు చెందినవారు కూడా ఉన్నారు. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వారితో మాట్లాడారు. ఈరోజు ఉదయం శివమొగ్గలో ఆపరేషన్ కావేరి కింద సూడాన్ నుండి తరలించబడిన హక్కీ పిక్కీ తెగ సభ్యులతో సంభాషించిన.. వారి ఎదుర్కొన్న పరిణామాల గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హక్కీ పిక్కీ తెగ సభ్యులు మాట్లాడుతూ.. తమను సకాలంలో, సురక్షితమైన తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వారు సూడాన్‌లో ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులను, భారత ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం తమ భద్రతకు ఎలా భరోసా ఇచ్చాయో వివరించారు. తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చూసుకుందని.. ఇదంతా ప్రధాని మోదీ కృషి వల్లే జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. తమ హృదయంలో ఆయన డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ సంఘ సభ్యుల పూర్వీకులు మహారాణా ప్రతాప్‌కు ఎలా అండగా నిలిచారో గుర్తు చేసుకున్నారు. ప్రపంచం మొత్తం మీద భారతీయులెవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించారని.. భారతీయులు ఎక్కడ చిక్కుకున్నారనేది బయటపెడితే పెద్ద ప్రమాదం వాటిల్లుతుందనేది తమ ఆందోళన అని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేసిందని వెల్లడించారు.
వారికి అండగా నిలిచిన దేశ బలాన్ని గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ కోరారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు.. సమాజానికి, దేశానికి చేయూతనిచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. విదేశాల్లోని ప్రజలు భారతీయ వైద్యంపై ఎలా విశ్వాసం ఉంచారనే దానిపై కూడా ప్రధాని మాట్లాడారు.
